Watch Video: ఆరు ఎకరాల ఆస్తి ఉన్నా ఇంటింటికి తిరిగి భిక్షాటన.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ

నవమాసాలు మోసి, రెక్కల ముక్కలు చేసుకొని పెంచిన తల్లిదండ్రులను నడిరోడ్డుపై నిలబెట్టాడు. ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, సొంత ఊరిలో పెద్ద బంగ్లా ఉన్నా.. ఆ వృద్ధ దంపతులకు మాత్రం భిక్షాటనే శరణ్యమైంది. సమాజం తలదించుకునే ఈ అమానవీయ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దమ్మక్కపేటలో వెలుగుచూసింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Watch Video: ఆరు ఎకరాల ఆస్తి ఉన్నా ఇంటింటికి తిరిగి భిక్షాటన.. వృద్ధ దంపతుల కన్నీటి గాథ
Elderly Parents Beg After Son Harassment

Edited By:

Updated on: Jul 08, 2026 | 6:07 PM

కరీంనగర్‌, జులై 8: ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కొడారి అయిలు కొమురయ్య, ఓదెమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కు మారుడు (రమేష్) ఉన్నారు. కొమురయ్య గతంలో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియా సింగరేణి సంస్థలో ఉద్యోగం చేసి 20 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఉద్యోగ కాలంలోనే నలుగురు కుమార్తెలకు, కుమారుడికి వివాహాలు జరిపించారు. సొంత గ్రామంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఒక పక్కా ఇల్లు (బంగ్లా) నిర్మించుకున్నారు.

​గత నాలుగేళ్ల క్రితం తల్లి ఓదెమ్మ క్యాన్సర్ బారిన పడటంతో, ఆమె చికిత్స కోసం కొమురయ్య రూ. 4 లక్షల అప్పు చేశారు. ఆ అప్పు తీర్చాల్సిందిగా కుమారుడు రమేష్‌ను కోరగా అతడు నిరాకరించాడు. దీంతో తను సంపాదించిన ఆరు ఎకరాల భూమిలోంచి ఒక ఎకరం అమ్మి అప్పు తీర్చుకుంటానని తండ్రి అనడంతో కొడుకు కసాయిగా మారాడు. తల్లిదండ్రులపై ఆగ్రహంతో ఊగిపోతూ, బంధువులతో కలిసి తండ్రిపై దాడి చేయించి, వారిని ఇల్లు, ఆస్తి నుంచి బలవంతంగా గెంటివేశాడు.

​పోలీసుల కౌన్సెలింగ్ సైతం బేఖాతర్..

​ఈ విషయమై బాధితుడు కొమురయ్య స్థానిక పోలీసులను ఆశ్రయించగా, తనపై దాడి చేసిన నిందితులపై కేసు నమోదైంది. అనంతరం జమ్మికుంట సిఐ.. కొడుకు రమేష్‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరు ఎకరాల భూమిలో ఒక ఎకరం అమ్మి అప్పులు తీర్చాలని, రెండు ఎకరాలు వృద్ధ దంపతుల పేరున ఉంచి, మిగిలిన మూడు ఎకరాలు రమేష్ పేరిట రాసివ్వాలని రాజీ కుదిర్చారు. పోలీసుల ముందు ఒప్పుకున్న కొడుకు, బయటకు వచ్చాక బుద్ధి మార్చుకున్నాడు. తండ్రి భూమి అమ్మకుండా కొనుగోలుదారులను బెదిరిస్తూ అడ్డుపడ్డాడు. ​కొడుకు వేధింపులు తట్టుకోలేక వృద్ధ దంపతులు తమ కుమార్తెల ఇళ్లకు వెళ్లగా.. రమేష్ అక్కడికి కూడా వెళ్లి గొడవలకు దిగాడు. దీంతో కూతుళ్లకు భారం కాలేక, వారి కాపురాల్లో నిప్పులు పోయలేక ఆ వృద్ధ దంపతులు హుజురాబాద్ మండలం దమ్మక్కపేటలోని తమ దూరపు బంధువుల ఊరికి చేరుకున్నారు.

 

​మూడు వేల మందులు.. రెండు వేల పెన్షన్…

​ప్రస్తుతం హుజురాబాద్ మండలం దమ్మక్కపేటలో నివాసముంటున్న ఈ వృద్ధ దంపతులు చుట్టుపక్కల వారి వద్ద బియ్యం, నిత్యావసర సరుకులు అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నారు. చివరకు వారి కులం వద్ద భిక్షాటన చేసే మంద గొల్ల యాచకులు సైతం వీరికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. “క్యాన్సర్ బాధితురాలైన నా భార్యకు ప్రతినెల రూ. 3,000 మందుల ఖర్చు అవుతోంది. ప్రభుత్వమిచ్చే రూ. 2,000 వృద్ధాప్య పెన్షన్ దేనికీ సరిపోవడం లేదు. ఇంత బతుకు బతికి.. ఈ వయసులో జోలెపట్టే దుస్థితి వచ్చింది” అంటూ కొమురయ్య, ఒదమ్మలు కన్నీటిపర్యంతమయ్యారు. తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us