Telangana: ఒక్కొక్కరి అకౌంట్లో లక్షన్నర.. సింగరేణి కార్మికులకు సర్కార్ గుడ్ న్యూస్..

సింగరేణి కార్మికులకు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థ సాధించిన రికార్డు స్థాయి లాభాల్లో కార్మికులకు 34శాతం వాటా ప్రకటించింది. దీంతో ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ.1.53 లక్షలు జమ కానున్నాయి. బోనస్‌తో పాటు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కీలక సమస్యల పరిష్కారానికి పక్కా రోడ్‌మ్యాప్‌ను మంత్రులు వెల్లడించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: ఒక్కొక్కరి అకౌంట్లో లక్షన్నర.. సింగరేణి కార్మికులకు సర్కార్ గుడ్ న్యూస్..
Singareni Workers Bonus Announced

Updated on: Oct 13, 2026 | 3:45 PM

సింగరేణి కార్మికుల శ్రమకు తగ్గ గుర్తింపు దక్కింది. సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో 34 శాతం మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్‌గా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ వివరాలను అధికారికంగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.1,754 కోట్ల లాభాలు వచ్చాయని భట్టి తెలిపారు. లాభాల వాటా పంపిణీ ద్వారా సంస్థ పరిధిలోని సుమారు 38 వేల మంది శాశ్వత కార్మికులకు తలా రూ.1,53,912 మేర బోనస్‌ అందనుంది. అలాగే 30 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.5,500 చొప్పున పంపిణీ చేయనున్నారు.

15 రోజుల్లో పెండింగ్ సమస్యల పరిష్కారం

సంస్థలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న 300 మంది డిపెండెంట్‌ కార్మికుల నియామక పత్రాలను రాబోయే 15 రోజుల్లో అందజేయనున్నారు. గనుల ప్రాంతంలో కార్మికుల మారుపేర్లకు సంబంధించిన సమస్యను కూడా పక్షం రోజుల్లోగా పరిష్కరిస్తారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో విధులకు రాలేక ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది తిరిగి విధుల్లో చేరేందుకు వన్ టైమ్ ఆప్షన్ కింద అవకాశం కల్పిస్తున్నారు.

సొంత ఇంటి స్థలాలు.. కార్పొరేట్ వైద్యం

కార్మికులకు శాశ్వత గృహవసతి కల్పించేందుకు మైనింగ్‌ పూర్తయిన ఖాళీ ప్రదేశాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసి.. నెహ్రూ హౌసింగ్‌ కాలనీ పేరుతో స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రులు తెలిపారు. సింగరేణి ఆసుపత్రులను కార్పొరేట్ ప్రమాణాలతో ఆధునీకరిస్తామని చెప్పారు. ఉద్యోగుల భద్రత కోసం అమలు చేస్తున్న ప్రమాద బీమా కింద శాశ్వత సిబ్బందికి రూ.1.2 కోట్లు, ఒప్పంద సిబ్బందికి రూ.40 లక్షల వరకు ఆర్థిక రక్షణ కల్పిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు.

ఇప్పటివరకు సంస్థలో 3,189 ఉద్యోగాలను భర్తీ చేశామని.. అందులో 2,437 కారుణ్య నియామకాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కోల్ బ్లాక్ వేలాల్లో గత పాలకులు పాల్గొనకపోవడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రస్తుతం సంస్థ కోసం కొత్త బొగ్గు బ్లాకులను దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us