BJP: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి గండి.. ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు.. తాజాగా బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి..

తెలంగాణ కంటే కుటుంబ ప్రయోజనాలకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమని దుయ్యబట్టారు. అందుకే బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు మర్రి శశిధర్‌రెడ్డి.

BJP: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి గండి.. ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు.. తాజాగా బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి..
Marri Shasidhar Reddy
Follow us

|

Updated on: Nov 25, 2022 | 6:07 PM

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సోనోవాల్‌, కిషన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌, డీకే ఆరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని.. అందుకోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటంలేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ విఫలమైందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ అవినీతిపై పోరాడటంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు.

ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి పట్ల దేశమంతా సానుకూలంగా ఉందని వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. తెలంగాణలో కుటుంబపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. తెలంగాణ కంటే కుటుంబ ప్రయోజనాలకే సీఎం కేసీఆర్ ప్రాధాన్యమని దుయ్యబట్టారు. అందుకే బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు మర్రి శశిధర్‌రెడ్డి.

అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అభద్రతాభావంతో వ్యవహరిస్తూ.. తన గోయిని తానే తవ్వుకుంటోందని విమర్శించారు.

ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసిన మర్రి శశిధర్‌‌రెడ్డి బీజేపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శశిధర్‌రెడ్డిని కాంగ్రెస్‌ బహిష్కరించింది. ఆ తరువాత రెండు రోజులకే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన శశిధర్‌రెడ్డి.. కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే పరువునష్టం కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని గురువారం శశిధర్‌ రెడ్డికి ఆయన లీగల్‌ నోటీస్‌ కూడా పంపారు.

తెలంగాణ కాంగ్రెస్‌ను వీడిన నేతలు వీరే..

  • మర్రి శశిధర్ రెడ్డి, మాజీ మంత్రి
  •  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
  • దాసోజు శ్రవణ్, మాజీ అధికార ప్రతినిధి
  • ముథోల్ రామారావు పటేల్, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
  • పాల్వాయి హరీష్, సిర్పూర్ ఖాగజ్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్
  • బొమ్మ శ్రీరామ్, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్

గతంలో చేరిన కాంగ్రెస్ నేతలు..

  • డికే అరుణ, మాజీ మంత్రి
  • బిక్షమయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే
  • విజయశాంతి, మాజీ ఎంపీ
  • చంద్రశేఖర్, మాజీ మంత్రి
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ
  • నల్లాల ఓదేలు, మాజీ ఎమ్మెల్యే
  • రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎంపీ
  • పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ
  • కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం