
Telangana Education News: ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల పురోగతిని తెలుసుకోవడానికి పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే విద్యార్థుల పరీక్షల ఫలితాలు, ప్రోగ్రెస్ కార్డులను తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది విద్యాశాఖ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ సదుపాయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-I) పరీక్షలకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. తమ పిల్లలు పరీక్షల్లో ఎలా రాణించారు? ఏయే సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించారు? చదువులో వారి పురోగతి ఎలా ఉంది? అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
ఈ సదుపాయాన్ని తల్లిదండ్రులందరూ వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ సూచించారు. పిల్లల విద్యా ప్రగతిపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి సారించాలని, పాఠశాలలతో సమన్వయం చేసుకుంటూ వారి అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు కూడా విద్యాశాఖ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలను ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ISMS) పోర్టల్‌లో క్రమం తప్పకుండా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 2026 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన పెండింగ్ హాజరు వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెలకు సంబంధించిన హాజరు వివరాలను తరువాతి నెల 1వ తేదీలోపు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేయాలి.
ఈ ప్రక్రియ సక్రమంగా అమలవుతుందో లేదో జిల్లా విద్యాశాఖ అధికారులు (DEOs) పర్యవేక్షించాలని డాక్టర్ నవీన్ నికోలస్ సూచించారు. తమ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు పెండింగ్ వివరాలను ఆలస్యం చేయకుండా అప్‌డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.