ఇకపై లైసెన్స్ కావాలంటే ఇలా చేయాల్సిందే! కొత్త గైడ్ లైన్స్ జారీ చేసిన తెలంగాణ రవాణా శాఖ

తెలంగాణ RTO, డ్రైవింగ్ టెస్ట్ కేంద్రాలలో అవకతవకలు, ఏజెంట్లతో కుమ్మక్కుపై ACB నివేదించింది. దీనితో ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను పటిష్టం చేసింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా హాజరు కావాలి, పూర్తి టెస్ట్ చేయాలి. బ్రోకర్లను నిషేధించి, CCTV పర్యవేక్షణ, రికార్డుల పారదర్శకతను పెంచారు.

ఇకపై లైసెన్స్ కావాలంటే ఇలా చేయాల్సిందే! కొత్త గైడ్ లైన్స్ జారీ చేసిన తెలంగాణ రవాణా శాఖ
Driving Licence Telangana

Updated on: Jun 09, 2026 | 7:54 AM

తెలంగాణవ్యాప్తంగా వివిధ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు, RTO కార్యాలయాలలో దరఖాస్తుదారులు రాకుండానే లైసెన్సులు జారీ చేయడం, ప్రైవేట్ ఏజెంట్లతో కుమ్మక్కవడం, తనిఖీ అధికారుల రాకపై రహస్య కోడ్‌లు ఉపయోగించడం వంటి తీవ్ర అవకతవకలు జరుగుతున్నట్లు ACB తనిఖీల్లో తేలింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఈ సూచనలు జారీ చేశారు. ప్రతి దరఖాస్తుదారు పరీక్ష రోజున కచ్చితంగా ప్రత్యక్షంగా హాజరు కావాలి. రాని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ లైసెన్స్ ఇవ్వకూడదు. MVI ఇన్ఛార్జ్ పరీక్షకు ముందే ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా అభ్యర్థిని స్వయంగా ధృవీకరించాలి.

డ్రైవింగ్ టెస్ట్ మార్గాన్ని పూర్తిగా పూర్తి చేయాలి. కేవలం స్టీరింగ్ ముందుకు కూర్చోవడం లేదా కొద్ది దూరం నడపడంపై ఇకపై కుదరదు. వాహనాన్ని ఆపడం, వెనక్కి నడపడం, లేన్ క్రమశిక్షణ, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం వంటి సామర్థ్యాలను ప్రదర్శించాలి. పరీక్ష సమయంలో CCTV కెమెరాలు నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ప్రతి పరీక్ష ముగియగానే ఫలితాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, పరీక్షించిన అధికారి, ఇన్‌ఛార్జ్ సంతకాలు చేయాలి. బ్రోకర్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులను ట్రాక్ ప్రాంగణంలోకి అనుమతించకూడదు. ప్రవేశ ద్వారం వద్ద ఈ మేరకు నోటీసు బోర్డు పెట్టాలి. ఏజెంట్లతో చేతులు కలిపిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేస్తారు.

సీనియర్ అధికారులు లేదా ACB బృందాల రాకను ఒకరికొకరు హెచ్చరించుకునేందుకు ఎలాంటి రహస్య కోడ్‌లు, సంకేతాలు, నంబర్లను ఉపయోగించకూడదు. డిజిటల్, భౌతిక రికార్డులు రోజువారీగా సరిపోలాలి. తేడాలు ఉంటే RTO కి నివేదించాలి. అలాగే ప్రతి నెల 15వ తేదీ లోపు రవాణా కమిషనర్ కార్యాలయానికి నెలవారీ కంప్లయెన్స్ నివేదికలు సమర్పించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత ఉద్యోగులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us