పది పాస్ కాకుండానే డాక్టర్లు అవుతున్నారు.. ఆర్‌ఎంపీ అవ్వాలంటే ఏం చదవాలి?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్‌ఎంపీ పేరుతో వైద్యం చేయాలంటే అర్హత, రిజిస్ట్రేషన్‌ నిబంధనలు తెలుసుకోవాలి. గుర్తింపు పొందిన వైద్య విద్య లేకుండా అల్లోపతి చికిత్స, మందులు, ఇంజక్షన్లు ఇవ్వడం చట్టపరమైన సమస్యలకు దారితీయొచ్చు. కేవలం ప్రైవేట్‌ సంస్థల RMP సర్టిఫికెట్లు డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసే హక్కు ఇవ్వవు.

పది పాస్ కాకుండానే డాక్టర్లు అవుతున్నారు.. ఆర్‌ఎంపీ అవ్వాలంటే ఏం చదవాలి?
Rmp Doctor Qualification

Updated on: Aug 11, 2026 | 6:54 AM

తాజాగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలోని బస్వాపురంలో ఆర్ఎంపీ అని చెప్పుకునే వ్యక్తి 14 ఏళ్ల బాలికకు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె చనిపోయిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం జలుబుతో కాస్త నలతగా ఉందని బాలికను తల్లిదండ్రులు ఆ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ వ్యక్తి ఏదో గుర్తు తెలియని ఇంజెక్షన్ ఇవ్వడంతో బాలిక మరణించింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఆర్ఎంపీ వైద్యుల వైద్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో చిన్నచిన్న క్లినిక్‌లు నిర్వహిస్తూ వైద్యం చేసే వారిని సాధారణంగా ఆర్‌ఎంపీలు అని పిలుస్తుంటారు. కొంతమందికి క్లినిక్‌లు కూడా ఉండవు. గ్రామాల్లో బైకులపై తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి వైద్యం చేస్తుంటారు. ఏ పని దొరక్క, చదువు సరిగ్గా రాకపోయినా ఆర్ఎంపీలుగా చెలామణి అయ్యేవాళ్లు కూడా ఉన్నారు గ్రామాల్లో. అయితే అసలు ఆర్ఎంపీ అవ్వాలంటే ఏం చదవి ఉండాలి? వారికి ఉండాల్సిన అర్హతలేంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆర్‌ఎంపీ అంటే ఏమిటి?

వైద్యరంగంలో RMP అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అంటే గుర్తింపు పొందిన వైద్య విద్యను అభ్యసించి, సంబంధిత మెడికల్‌ రిజిస్టర్‌లో నమోదు చేసుకున్న వ్యక్తి. ఆర్ఎంపీలను రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా కూడా చెబుతుంటారు. కాగా, వీరు ఆధునిక వైద్యం చేయాలంటే గుర్తింపు పొందిన వైద్య అర్హతతో పాటు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌ అవసరం. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ కూడా వైద్యుల రిజిస్ట్రేషన్‌, ప్రాక్టీస్‌ లైసెన్స్‌కు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోంది.

మరి ఆర్‌ఎంపీగా మారేందుకు ఏం చదవాలి?

MBBS చదివి, అవసరమైన ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి, మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ పొందినవారు ఆధునిక వైద్యాన్ని చట్టబద్ధంగా ప్రాక్టీస్‌ చేయగలరు. తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ గుర్తింపు పొందిన వైద్య విద్యలో MBBS కోర్సును నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా గతంలో తెలంగాణలో RMP/PMPలకు శిక్షణ ఇచ్చే విధానం ఉన్నప్పటికీ అల్లోపతి ప్రాక్టీస్‌ కోసం కొత్తగా శిక్షణ ఇవ్వడం లేదా సర్టిఫికెట్లు జారీ చేయడంపై హైకోర్టు ఆంక్షలు విధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం 2026లో స్పష్టం చేసింది. ఈ అంశం న్యాయపరిధిలో కొనసాగుతోంది.

అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తే?

అర్హత, రిజిస్ట్రేషన్‌ లేకుండా ఆధునిక వైద్యం చేయడం చట్టపరంగా సమస్యలకు దారితీస్తుంది. తెలంగాణలో తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్లు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1968 ప్రకారం రిజిస్టర్‌ కాని వ్యక్తి ఆధునిక శాస్త్రీయ వైద్యాన్ని ప్రాక్టీస్‌ చేయడం లేదా తాను వైద్యుడినని చూపించుకోవడంపై నిషేధం ఉంది. ఇలాంటి కేసుల్లో పోలీసు ఫిర్యాదు, క్రిమినల్‌ చర్యలు కూడా జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో అర్హత లేని వ్యక్తులు అల్లోపతి మందులు రాయడం, ఇంజక్షన్లు ఇవ్వడం, చికిత్స చేయడం వంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025లో హైకోర్టు విచారణలో కూడా గుర్తింపు పొందిన MBBS అర్హత లేకుండా ఆధునిక వైద్యం చేసిన వ్యక్తిపై FIR నమోదైన విషయం ప్రస్తావనకు వచ్చింది.

ఏదైనా ప్రైవేట్‌ సంస్థ ఇచ్చే RMP Certificate, RMP Course Certificate లేదా స్వల్పకాలిక కోర్సు సర్టిఫికెట్‌ మాత్రమే ఉంటే అల్లోపతి డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసే చట్టబద్ధ హక్కు వస్తుందని భావించకూడదు. అలాగే ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి ఇతర వైద్య విధానాల్లో అర్హత ఉన్నవారు కూడా తమకు అనుమతించని ఆధునిక వైద్య విధానాన్ని ప్రాక్టీస్‌ చేయలేరు. 2025లో తెలంగాణ హైకోర్టు కూడా నాన్‌-అల్లోపతి వైద్యులు అల్లోపతి మందులు ప్రిస్క్రైబ్ చేయడం అనుమతించబడదని స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us