పిల్లనివ్వలేదనీ మేనమామల ఇళ్లకు కన్నం వేసిన మేనల్లుడు.. ఆ తర్వాత సీన్ ఇదే!
ప్రేమించిన మరదలను తనకు కాకుండా చేశారని మేనమామలపై కక్ష పెంచుకున్నాడు ఓ మేనల్లుడు. చివరకు సొంత మేనమామల ఇళ్లనే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డాడు. బంధుత్వాన్ని మరిచి.. నమ్మకాన్ని వమ్ము చేసి.. మేనమామల ఇళ్లలను పక్కా స్కెచ్ తో దోచేశాడు. అంతా సెట్ అనుకునేలోపే పోలీసుల తనిఖీల్లో పట్టుపడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జైపూర్ ఏసీపి వెంకటేశ్వర్ల వివరాల ప్రకారం..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంట్రాక్టర్ బస్తీకి చెందిన మగ్దూం వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మగ్దూంకు జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని కాసింపల్లిలో ముగ్గురు మేనమామలున్నారు. అందులో ఓ మేనమామ కూతురిను మగ్దూం ఇష్టపడ్డాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని మేనమామలను కోరాడు. కానీ మేనమామలు ఒప్పుకోలేదు. తనకు ఇష్టమైన మరదలిని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడంతో ఆ ముగ్గురు మేనమామలపై కక్ష పెంచుకున్నాడు మేనల్లుడు మగ్దూం.
ఈ విషయాన్ని తన స్నేహితుడు సబ్బని లక్ష్మీనారాయణ అలియాస్ చింటూతో తరచూ చెప్పేవాడు. ఎలాగైనా మేనమామలకు బుద్ధి చెప్పాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. మగ్దూం చిన్న మేనమామ షేక్ సలీం కుమారుడి పెళ్లి ఉండటంతో కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 28న దుస్తులు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన మగ్దూం.. స్నేహితుడు లక్ష్మీనారాయణతో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు. సెప్టెంబర్ 28 రాత్రి ఇద్దరూ పల్సర్ బైక్‌పై ఇందారం చేరుకున్నారు.
రెండు ఇళ్లు.. వరుస చోరీలు
ముందుగా చిన్న మేనమామ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు మగ్దూం. బీరువాను ధ్వంసం చేసి రూ.60 వేల నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను స్నేహితుడు లక్ష్మినారాయణతో కలిసి ఎత్తుకెళ్లాడు. అక్కడితో ఆగకుండా అదే రాత్రి మరో మేనమామ ఖాజాపాషా ఇంటిని టార్గెట్ చేశారు. ఆ ఇంటి తాళాలు, బీరువాలు సైతం పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలను దోచుకున్నారు. చోరీ చేసిన సొత్తును రెండు నల్లటి కవర్లలో పెట్టుకుని అదే రాత్రి బెల్లంపల్లికి చేరుకున్నారు. చోరీ చేసిన రూ.60 వేల నగదులో రూ.35 వేలు మగ్దూం, రూ.25 వేలు లక్ష్మీనారాయణ పంచుకున్నట్లు ఏసీపి వెంకటేశ్వర్లు తెలిపారు. మిగిలిన చోరీ సొత్తును హైదరాబాద్‌కు తరలించేందుకు బైక్‌పై బయలు దేరాడు మగ్దూం. ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండటంతో.. పోలీసులను గమనించిన మగ్దూం పారిపోయేందుకు ప్రయత్నించడంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద రెండు నల్లటి కవర్లు కనిపించాయి.
వాటిలో 6 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.13,300 నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారణ చేపట్టడంతో కాసింపల్లి చోరీల ఘటనను పూసగుచ్చినట్టు వెల్లడించాడు. మగ్దూంను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుండి 6 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.13,300 నగదు చోరీకి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సబ్బని లక్ష్మీనారాయణ అలియాస్ చింటూ పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇష్టపడిన అమ్మాయిని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారన్న కక్ష.. మేనమామలపై ప్రతీకారానికి దారితీసింది. ఆ కక్షతోనే సొంత బంధువుల ఇళ్లను టార్గెట్ చేసి చోరీకి పాల్పడ్డాడు మేనల్లుడు. కానీ పక్కాగా వేసుకున్న ప్లాన్.. ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసుల తనిఖీలతో బట్టబయలైంది. మేనమామలపై కక్ష తీర్చుకోవాలనుకున్న మేనల్లుడు.. చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలవక తప్పలేదు.




