Telangana: మేము ప్రేమించుకున్నాం.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు.. లవర్ ఐడియా మామూలుగా లేదుగా

ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే.. దేవదాసు అవ్వడమో లేదా వారిపై పగ తీర్చుకోవడమో చేసిన ఘటనలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. కానీ ఇక్కడో యువకుడు మాత్రం.. కాస్త వినూత్నంగా ఆలోచించాడు. తాను ప్రేమించిన యువతి తనకు దక్కట్లేదనే కోపంతో ఎలాగైనా ఆమె పెళ్లి ఆపాలని.. ఏకంగా వరుడి ఊరికి వెళ్లి, తామిద్దరూ కలిసి దిగిన ఫోటోలకు సంబంధించిన పోస్టర్లను ఊరంతా అంటించి వెళ్లాడు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Telangana: మేము ప్రేమించుకున్నాం.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు.. లవర్ ఐడియా మామూలుగా లేదుగా
Sircilla Love Poster Incident

Edited By:

Updated on: Jul 08, 2026 | 8:27 PM

ఏడేళ్లుగా ప్రేమించుకున్న యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించడంతో.. ఏకంగా వరుడి ఊరికి వెళ్లి, ప్రియుడు ఊరంతా తన ప్రేయసితో కలిసి దిగిన పోస్టర్లు అతికించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు, యువతి గత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ఆమెకు తంగళ్లపల్లికి చెందిన మరో యువకుడితో వివాహం నిశ్చయించి, ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఎలాగైనా పెళ్లి ఆపాలని.. నేరుగా వరుడి ఊరికి వెళ్లి అక్కడ యువతితో కలిసి దిగిన ఫోటోలను గోడలపై అతికించాడు.

తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పినా అంగీకరించలేదని.. ఇష్టం లేకపోయినా బలవంతంగా తన ప్రేయసికి వేరే పెళ్లి చేస్తున్నారని ప్రియుడు ఆరోపిస్తున్నాడు. కేవలం కట్నకానుకల కోసమే తన ప్రేయసిని మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తున్నారని కూడా వాల్ పోస్టర్లలో పేర్కొన్నాడు. తన ప్రేమను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే.. ప్రేయసితో కలిసి దిగిన ఫోటోతో పాటు పెళ్లి చేసుకోబోయే వరుడి ఫోటోను జత చేసి వాల్ పోస్టర్లు ముద్రించాడు. వాటిలో వరుడు, అతని తండ్రి పేరు, ఫోన్ నంబర్లతో పాటు ఇతర వివరాలు కూడా ముద్రించి గ్రామమంతా అతికించాడు.

యువకుడు కారులో వచ్చి పోస్టర్లు అతికిస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉదయం గ్రామస్థులు గోడలపై పోస్టర్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వ్యవహారంలో ప్రియుడు చేసిన ఆరోపణలపై వరుడి కుటుంబం నుంచి ఫిర్యాదు వస్తే పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us