జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయపక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. తెలంగాణ ఆవిర్భావించి దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో రేవంత్ సర్కార్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర గీతాన్ని, లోగోను, తెలంగాణ తల్లి విషయంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్దమైంది. దీనిపై వామపక్షాలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులతో తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీతం అంశాన్ని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రతిపాదించారు. ఆ తరువాత జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించారు. ఈ పాటను విన్న సిపిఐ, సిపిఎం, తెలంగాణ జన సమితి, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ గీతంలో ముగ్దూం మోహిణుద్దీన్ పేరును జత పర్చాలని సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు కోరారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. షేక్ బంధగీ, కొమురం భీం పేర్లు కూడా రాష్ట్ర గీతంలో పొందు పర్చేందుకు అంగీకారం తెలిపారు. ఇక తెలంగాణ రాజ ముద్రపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. లోగోపై కేబినెట్ సమావేశంతోపాటు, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి, అందరి అభిప్రాయాల తర్వాతే రాజముద్ర ప్రకటనపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను ఈ ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్ర గేయం, రాష్ట్ర రాజముద్ర విషయంలో అందరి నుంచి అభిప్రాయాలు తీసుకోవడంలో ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..