భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెళ్లిన NRI భర్త.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరిగినంత మాత్రాన విడాకులు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య తనను వేధిస్తోందంటూ ఓ ఎన్నారై భర్త వేసిన విడాకుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. భర్తతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని భార్య చెప్పడంతోపాటు, భర్త చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెళ్లిన NRI భర్త.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం
Telangana High Court Divorce Case

Edited By:

Updated on: Oct 20, 2026 | 5:04 PM

తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని ఓ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు జరిగినంత మాత్రాన విడాకులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ దంపతులకు 2009లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 16 ఏళ్ల కుమార్తె ఉంది. అయితే పెళ్లయిన రెండేళ్లకే, 2011 మార్చి 6న భర్త భార్య నుంచి విడిగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు.

కొంతకాలం తర్వాత భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు. అయితే భార్య మాత్రం భర్తతో కలిసి కాపురం చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో భర్త హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య మానసికంగా వేధించేదని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని ఆరోపించారు. తనను భార్య తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండాలని అత్తమామలు ఒత్తిడి చేశారని కూడా చెప్పారు. ఈ కారణాలతో భార్యతో కలిసి జీవించడం సాధ్యం కాదని, విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.

అదనపు కట్నం కోసం వేధించారని భార్య ఆరోపణ

భర్త చేసిన ఆరోపణలను భార్య ఖండించారు. తన పెళ్లి సమయంలో కుటుంబ సభ్యులు రూ.6.5 లక్షల నగదు, 10 తులాల బంగారం ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ మరో రూ.5 లక్షలు తీసుకురావాలని భర్త, ఆయన కుటుంబ సభ్యులు వేధించారని ఆరోపించారు. తనకు విడాకులు వద్దని, భర్తతో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నానని కోర్టుకు తెలిపారు.

ఆధారాలు లేవు.. విడాకులు ఇవ్వలేం

అయితే ఈ కేసును విచారించిన జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. భార్య వేధింపులకు గురిచేసిందని భర్త చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది.భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, సాధారణ విభేదాలు ఉన్నంత మాత్రాన వాటిని తీవ్రమైన మానసిక వేధింపులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అలాంటి కారణాలతోనే విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదని తెలిపింది.దీంతో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us