Telangana: కారు రేసింగ్‌ సరదా.. ఓ కుటుంబంలో విషాదం!

బంధువు పెళ్లికి భర్త, కుమార్తెతో వెళ్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. రెండు కార్లు ఢీకొట్టడంతో భర్త తీవ్రంగా గాయపడగా, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..

Telangana: కారు రేసింగ్‌ సరదా.. ఓ కుటుంబంలో విషాదం!
Sahanabegam

Updated on: Oct 17, 2026 | 1:56 PM

మహబూబ్‌నగర్‌ జిల్లాలో యువకుల అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బంధువు వివాహానికి భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పోటాపోటీగా దూసుకొచ్చిన రెండు కార్లు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ భర్త తీవ్రంగా గాయపడగా, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌కు చెందిన షాకీర్‌ టైలర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన తన భార్య షహానాబేగం (40), కుమార్తె ఆయారాతో కలిసి ద్విచక్ర వాహనంపై మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న బంధువు వివాహానికి బయలుదేరారు. అమిస్తాపూర్‌లోని యూపీఎస్‌ పాఠశాల సమీపంలో మలుపు వద్దకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన రెండు కార్లు ఒకదాని వెంట ఒకటి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో షహానాబేగం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదంలో షాకీర్‌కు రెండు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. తల్లి ఒడిలో ఉన్న చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను, షహానాబేగం మృతదేహాన్ని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు రెండు కార్లలో పోటాపోటీగా అతివేగంతో వెళ్తుండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక కారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మరో కారులో ఉన్న విద్యార్థులను వాహనంతో సహా పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. రోడ్లపై వేగంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us