Telangana: లోక్‌సభ ఎన్నికల వేళ.. కమలదళం ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల.. మతలబేంటో..?

| Edited By: Balaraju Goud

May 03, 2024 | 2:18 PM

ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ.. ఆదివాసీ ఉద్యమ నేత.. నిన్నమొన్నటి వరకు ఉద్యమాల్లో దూకుడుగా వ్యవహరించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, గెలిచి నిలిచిన నాయకుడు. కానీ ఐదేళ్ల కాలంలోనే ఆ చరిష్మా ఒక్కసారిగా మాయమై చివరికి సిట్టింగ్ సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఆయనకి ఎదురైంది.

Telangana: లోక్‌సభ ఎన్నికల వేళ.. కమలదళం ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల.. మతలబేంటో..?
Revanth On Soyam Bapurao
Follow us on

ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ.. ఆదివాసీ ఉద్యమ నేత.. నిన్నమొన్నటి వరకు ఉద్యమాల్లో దూకుడుగా వ్యవహరించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, గెలిచి నిలిచిన నాయకుడు. కానీ ఐదేళ్ల కాలంలోనే ఆ చరిష్మా ఒక్కసారిగా మాయమై చివరికి సిట్టింగ్ సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఆయనకి ఎదురైంది. దీంతో నిన్న మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన ఆ నేత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. సొంత పార్టీ కార్యక్రమాలకు సైతం టాటా బాయ్ బాయ్ చెప్పేశారు.

కీలకంగా మారిన పార్లమెంటు ఎన్నికల్లోను ఎక్కడా కనిపించకుండా ఇంటికే పరిమితమయ్యారు సిట్టింగ్ ఎంపీ. అలాంటి నేతపై అధికారంలో ఉన్న పార్టీ అగ్రజుడు ఉన్నఫలంగా సానుభూతిని.. ఎక్కడ లేని ప్రేమను కురిపించడం ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యర్థి పార్టీపై బాణాలు ఎక్కుపెడుతూనే అదే పార్టీకి చెందిన సిట్టింగ్ సీటుపై దయ చూపడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఆ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల పర్యటనకు వచ్చిన ప్రతిసారి.. ఆ నేతను ప్రత్యర్థి పార్టీ అదినేత ఆకాశానికి ఎత్తడం.. ఆ సిట్టింగ్ ఎంపి పై సానుభూతి వ్యక్త పరచడం.. అయ్యో పాపం అంటూ ఎక్కడలేని ప్రేమను కురిపించడం కొనసాగుతుండటంతో.. అసలింతకీ ఆ నేతకు ప్రత్యర్థి పార్టీ అధినేతకు మధ్య ఉన్న బందమేంటీ.. ఆ సానుభూతికి కారణమేంటి. ఎవరా.. ఆదివాసీ నాయకుడు.. ఆయనపై ఆ స్థాయిలో ప్రేమను కురిపిస్తున్న లీడర్ ఎవరు అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

సోయం బాపురావు.. ఆదివాసీల అదినాయకుడు.. తుడుందెబ్బ మాజీ అద్యక్షుడు.. ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపి. క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించాలంటూ గల్లీ నుండి ఢిల్లీ దాక ఉద్యమం చేసిన నేత. ఇదే జోష్ తో 2019 లో ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ సీటును దక్కించుకుని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గెలిచి నిలిచిన నేత. ఎంపీగా గెలిచాక మొదట్లో దూకుడుగా వ్యవహరించినా.. రాజకీయ పరిస్థితుల ప్రభావంతో దూకుడు తగ్గించుకుని సాగక తప్పలేదు. అటు తుడుందెబ్బ అద్యక్షుడిగా ఆదివాసీ ఉద్యమాన్ని ఇటు బీజేపీ ఎంపిగా జోడెద్దుల బండిని లాగలేక అనివార్య కారణాలతో తుడుందెబ్బను వీడక తప్పలేదు.

అంతే అక్కడ పడిన వెనుకడుగు తాజాగా టికెట్ కట్ వరకు ప్రతికూల పరిస్థితులనే తెచ్చిపెట్టింది. కాంట్రావర్సీ కామెంట్లతో అడపాదడపా తన ప్రభావాన్ని చూపే ప్రయత్నం చేసినా.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న అపవాదు.. ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ది ని గాలికి‌వదిలేసాడన్న రాజకీయ వర్గాల ఆరోపణలతో అన్నంత నష్టం జరిగిపోయింది. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ సీటును దక్కించుకోలేక.. ఎంపి టికెట్ కోల్పోయి సైలెంట్ మోడ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి.

పాపం సోయం.. సానుభూతి వెనుక మతలబేంటీ..?

అయితే సోయం బాపురావుకు ఎంపీ టికెట్ దక్కకపోవడం వెనుక సవాలక్ష కారణాలే ఉన్నాయన్నదీ బీజేపీ ‌క్యాడర్ టాక్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గూటికి చేరుతాడన్న బలమైన ప్రచారం.. నిర్మల్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మోదీ వచ్చినా, సభకు గైర్హాజరు కావడం.. బోథ్ ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చినా గెలిచి నిలవాలన్సిన చోట నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న అపవాదు. ఇవన్నీ సోయం టికెట్‌కు ఎసరు తెచ్చిపెట్టాయన్నదీ రాజకీయ వర్గాల విశ్లేషణ.

అయితే తాజాగా సోయం బాపురావుపై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి వ్యక్తం చేస్తూ, అయ్యో పాపం అంటూ జాలిని వ్యక్తపర్చడం సర్వత్ర చర్చకు దారి తీసింది. ఆదిలాబాద్ పార్లమెంట్ జనజాతర బహిరంగ సభల్లో వరుసగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సోయం బాపురావును ఆకాశానికెత్తడం అందరిని ఆలోచనలో పడేసింది. ఆదివాసీ నాయకుడిగా ఘన విజయం సాధిస్తే మోదీ సర్కార్ కనీసం సోయం బాపురావుకు ఆ స్థాయి గౌరవం కట్టబెట్టలేదని, ఆదిలాబాద్ అభివృద్దికి సోయం ప్రయత్నించినా అడుగడుగునా మోదీ ‌సర్కార్ మోకాలడ్డుపెట్టుతూనే వచ్చిందన్నారు. పాపం సోయం చివరికి టికెట్ ను కూడా దక్కించుకోలేకపోయాడంటూ సానుభూతిని వ్యక్తం చేయడం కనిపించింది.

సోయం బాపురావు కాదని బీఆర్ఎస్ నుండి అరువు తెచ్చుకున్న ఆదివాసీ దొర గొడెం నగేష్ కు బీజేపీ టికెట్ కట్టబెట్టిందంటూ సోయం బాపురావును హీరోను చేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి మాటాల్లో కనిపించిదన్నదీ రాజకీయ విశ్లేషకుల మాట. అయితే మిషన్ 15 తో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ లో ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేస్తూనే అదే పార్టీకి చెందిన నేతపై సానుభూతి వరద కురిపించడం వెనుక మతలబు లేకపోలేదన్నదీ పొలిటికల్ సర్కిల్ ముచ్చట. చూడాలి మరీ ఆ మతలబేంటో.. కమలదళంలో సాగుతున్న ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల పరమార్థమేంటో పార్లమెంట్ ఎన్నికలే తేల్చాలి. చూడాలి మరీ సానుభూతి వరద సోయానికి ఏ స్థాయిలో స్నేహ హస్తం అందిస్తుందో.. హస్తానికి ఏ స్థాయిలో మేలు చేస్తుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..