
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో లైవ్ బుల్లెట్ దొరకడం కలకలం రేపింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఒక ప్రయాణికుడి బ్యాగులో తూటా (లైవ్ రౌండ్ బుల్లెట్) లభ్యమైంది. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి చెందిన నిర్మల్ బరా (42) అనే వ్యక్తి EY359 విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే చెక్-ఇన్ సమయంలో అతని బ్యాగేజీని భద్రతా సిబ్బంది స్కానింగ్ చేయగా, బ్యాగులో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది బ్యాగును తెరిచి పరిశీలించగా అందులో ఒక లైవ్ రౌండ్ బుల్లెట్ బయటపడింది.
తక్షణమే అతడిని అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ భద్రతా అధికారులు బుల్లెట్ గురించి ప్రశ్నించారు. అయితే, ఆ బ్యాగ్ తనది కాదని, దుబాయ్‌లో ఉంటున్న తన స్నేహితుడు సూరజ్‌కు చెందినదని నిర్మల్ బరా అధికారులకు వివరించారు. సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో భద్రతా సిబ్బంది అతడిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఆ బుల్లెట్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.