
కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించాలని తలపెట్టిన ఫ్లైఓవర్ల ప్రాజెక్టులపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్‌ను నివారించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని తొలుత అధికారులు భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టులను ఉన్నట్లుండి ఒక్కసారిగా జీహెచ్ఎంసీ రద్దు చేసినట్లు సమాచారం. ఫ్లైఓవర్లు నిర్మించేందుకు గుంతలు తవ్వడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టారు. కానీ ఏమైందో ఏమో కానీ ప్రాజెక్టులను నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పనుల క్రమంలో గతంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం తీసుకొచ్చారు. దీని వల్ల తొలుత వాహనదారులు కాస్త ఇబ్బందులు పడ్డా.. తర్వాత ట్రాఫిక్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
వన్ వే వల్ల ట్రాఫిక్ సమస్యలు లేకపోవడం, వాహనదారులకు కూడా ఎలాంటి అవాంతరాలు కలగకపోవడంతో శాశ్వతంగా ఈ విధానం కొనసాగించాలని అధికారులు నిర్ణయం తీసుకుున్నారు. వన్‌వేలో డివైడర్లు తగ్గించి ఆరు లేన్లుగా మార్పు చేయాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లకు బదులుగా ఒక ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ నిర్మించాలని భావిస్తున్నారు. పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు 4.4 కి.మీ. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. దీని వల్ల పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వాహనదాలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు.
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ మధ్య భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. ఆరు లైన్లగా ఈ భారీ ఫ్లైఓవర్ ఉండనుంది. నాగార్జున సర్కిల్ వద్ద వాహనాలు ఎక్కితే ఒకేసారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ కింద దిగవచ్చు. ఇక అటు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడితే నేరుగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో దిగవచ్చు. దీని వల్ల పంజాగుట్ట నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వెళ్లేవారికి ఊరట కలగనుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల మరింత వేగవంతమైన ప్రయాణం లభించనుంది. ఇప్పటివరకు ఈ మార్గంలో సిగ్నల్స్ ఎక్కువగా ఉండటం వల్ల రద్దీ సమయాల్లో ఎక్కువసేపు వాటి వద్ద ఆగాల్సి వస్తోంది. కొన్నిసార్లు ట్రాఫిక్ రద్దీ వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్ రాకతో ఈ ఇబ్బంది శాశ్వతంగా తొలగిపోనుంది.