అన్నా.. అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఫ్రెండ్లీ పోలీసింగ్ మాట దేవుడెరుగు. కొందరు ఖాకీలు ఇప్పటికీ తమలోని అహంకార వైఖరిని ఏదో రకంగా బయటపెట్టుకుంటున్నారు. కరీంనగర్‌లోని ఓ ఎస్సై వ్యవహరించిన తీరు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. అన్నా అన్నందుకు.. ఓ ఎస్ఐ వ్యక్తిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

కరీంనగర్ జిల్లాలో ఓ పోలీస్ అధికారి సామాన్యుడితో వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ ఎస్‌ఐ తనను అన్నా అని సంభోదించాడనే కారణంగా ఒక వ్యక్తిపై దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. నగరంలోని ఖానాపూర్ ఏరియాలో ఉన్న ఒక సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్‌ఐ చందర్.. షేవింగ్ చేయించుకోవడానికి వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్.. ఎస్‌ఐని కూర్చో అన్నా అని కోరాడు. అయితే ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా అంటూ మండిపడ్డ ఎస్‌ఐ తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సెలూన్‌లో అందరూ చూస్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించాడు.
ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్‌లోని సిసిటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐ చందర్‌ను సస్పెండ్ చేశారు.
వీడియో చూడండి..
కాగా.. దీనికి సంబధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అన్నా అన్నందుకు చేయి చేసుకోవాలా అంటూ నిలదీస్తున్నారు.
