
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఘరానా దొంగను కరీంనగర్ రూరల్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వేలిముద్రలు లభించకుండా దొంగతనం చేసిన ఇంట్లో కారం పొడి చల్లినప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్‌కు చెందిన బాలసాని అజయ్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే దొంగతనాలకు అలవాటు పడ్డాడు. గతంలో మానకొండూరు మండలం ఊటూరు బ్యాంకులో దోపిడీ కేసుతో పాటు, సుల్తానాబాద్‌లో జరిగిన మూడు దొంగతనాల కేసుల్లో అరెస్టయ్యాడు.
2025లో హైదరాబాద్‌కు వెళ్లిన అజయ్.. అక్కడి ఏఎంబీ షాపింగ్ మాల్‌లో కొంతకాలం సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. ఈ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజుతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ బైక్‌పై శ్రీశైలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి అజయ్ చొరబడ్డాడు. అక్కడ రెండున్నర తులాల బంగారం, కొంత నగదు అపహరించాడు. ఆ తర్వాత కాశీ వెళ్లాలనే ఉద్దేశంతో కరీంనగర్ చేరుకున్నాడు.
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో చొరబడిన అజయ్.. పావు తులం బంగారంతో పాటు 25 తులాల వెండిని అపహరించాడు. అయితే తన వేలిముద్రలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఇంట్లోని కారం పొడిని చల్లి అక్కడి నుంచి పరారయ్యాడు. గత ఆగస్టులో జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిన పోలీసులు నాట్‌గ్రిడ్ యాప్ ద్వారా సేకరించిన సమాచారంతో అజయ్ ప్రమేయాన్ని గుర్తించారు. అనంతరం బొమ్మకల్‌లోని కోకాకోలా దాబా వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నిరంజన్ రెడ్డి వెల్లడించారు. క్లూస్ దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.