
బాన్సువాడ (కామారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భర్తను పథకం ప్రకారం అంతమొందించిన సంచలనాత్మక ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేటలో వెలుగుచూసింది. గుమ్మడి కాశీరాం (26) అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు.. ఇదొక పక్కా ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్యగా తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మడి కాశీరాం – సవిత భార్య భర్తలు.. కాశీరాం భార్య గుమ్మడి సవితకు పసుపుల సంతోష్ అనే వ్యక్తితో వివాహేతర పరిచయం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డంకిగా మారాడని భావించిన సవిత, ఎలాగైనా అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో సంతోష్‌తో పాటు చింతకింద రాము అనే మరో వ్యక్తిని కలుపుకొని కాశీరాంను హతమార్చడానికి స్కెచ్ వేసింది.
ప్లాన్‌లో భాగంగా ఈనెల 23వ తేదీ రాత్రి సంతోష్, రాము ఇద్దరూ కలసి కాశీరాంను మద్యం తాగుదామని నమ్మించి గ్రామ శివార్లలోని పచ్చేరు చెరువు వద్దకు తీసుకెళ్లారు. కాశీరాం పూర్తిగా మద్యం మత్తులోకి జారుకున్న తర్వాత, వారిద్దరూ నైలాన్ తాడుతో మెడకు ఉరి బిగించి అతడిని ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు మృతదేహాన్ని చెరువు నీటిలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. కుమారుడు కనిపించకుండా పోవడం, చెరువులో శవమై తేలడంతో కాశీరాం తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సమగ్రంగా విశ్లేషించగా.. ఈ దారుణానికి ఒడిగట్టింది భార్య సవిత, ఆమె ప్రియుడు సంతోష్, రాము అని స్పష్టమైంది.
బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి శుక్రవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రధాన నిందితురాలు సవితతో పాటు సంతోష్, రాములను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు తదితర కీలక ఆధారాలను జప్తు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
Wife, Lover Arrested In Husband Killing