Telangana: ఆ ఊళ్లోకి ఐస్ క్రీమ్ బండి వస్తే అంతే సంగతులు.. రూ.5000 కట్టాల్సిందే..

అక్కడ ఐస్‌క్రీమ్ బండి కనిపిస్తే చాలు అమ్మే వ్యక్తి జేబుకు ఐదు వేల రూపాయల చిల్లు పడాల్సిందే.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, జగిత్యాల జిల్లాలోని మెట్ల చిట్టాపూర్ గ్రామం ఇప్పుడు కల్తీ ఐస్‌క్రీమ్‌ల మీద యుద్ధం ప్రకటించింది. రంగురంగుల రసాయనాలతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లకు చెక్ పెట్టేందుకు గ్రామస్థుల నిర్ణయం చర్చనీయాంశమైంది.

Telangana: ఆ ఊళ్లోకి ఐస్ క్రీమ్ బండి వస్తే అంతే సంగతులు.. రూ.5000 కట్టాల్సిందే..
Jagtial Village Bans Ice Cream Carts

Edited By:

Updated on: Apr 02, 2026 | 10:01 PM

నేటి కాలంలో ఏది తిన్నా కల్తీ.. ఏది చూసినా కల్తీ. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు, రంగురంగుల ఐస్‌క్రీమ్‌లతో ఆటోలు, బండ్లు వీధుల్లో సందడి చేస్తుంటాయి. అయితే ఆకర్షణీయంగా కనిపించే ఈ ఐస్‌క్రీమ్‌ల వెనుక ప్రాణాంతక రసాయనాలు, అపరిశుభ్ర వాతావరణం దాగి ఉందనేది చేదు నిజం. ఈ కల్తీ ఐస్‌క్రీమ్‌ల బారిన పడి తమ పిల్లల ఆరోగ్యం పాడవకూడదని జగిత్యాల జిల్లాలోని ఒక గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే ఐస్‌క్రీమ్‌ల నిషేధం. గ్రామంలోకి ఐస్‌క్రీమ్ ఆటోలు, బండ్లు రాకూడదని గ్రామ పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి గ్రామంలో ఐస్‌క్రీమ్‌లు అమ్మితే రూ.5000 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఊరి పొలిమేరల్లో, ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

పిల్లల ఆరోగ్యమే పరమావధి

గ్రామస్తుల ఆందోళనకు ప్రధాన కారణం కల్తీ ఐస్‌క్రీమ్‌లే. మార్కెట్‌లో విచ్చలవిడిగా దొరుకుతున్న ఈ ఐస్‌క్రీమ్‌లను అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారని, రంగు కోసం హానికరమైన రసాయనాలను వాడుతున్నారని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఐస్‌క్రీమ్‌లు తిని చిన్నపిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని వారు స్పష్టం చేశారు.

“మా గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండ్లకు ప్రవేశం లేదు.. అతిక్రమిస్తే రూ. 5000 ఫైన్” అంటూ వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయాన్ని చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల వల్ల కలిగే అనారోగ్యాల కంటే ఇలాంటి కఠిన నిబంధనలే మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us