ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడికి ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
Uday Krishna Reddy

Updated on: Jul 20, 2026 | 11:53 AM

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీ (NPA)లో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు, దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కర్నాటకకు చెందిన 30 ఏళ్ల వివాహిత ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపుతూ వేధించడంతో పాటు గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమి, మెడపై కత్తిపెట్టి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే బాధితురాలి వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి ఆమె భర్తకు పంపుతూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు తీవ్రమైన సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, NPA ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఆరోపణలు నిజమని నిర్ధారించడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పోలీసులు నోటీసులు జారీ చేయగా, తనకు ఎలాంటి తప్పు లేదంటూ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్ స్టా స్టేటస్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ జర్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఆదర్శంగా నిలిచిన వ్యవహారం. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్..  తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ కూలిపనులు చేసి తెచ్చే డబ్బుతోనే వారి జీవనం సాగింది. ఆ కసితోనే 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అయితే ఓ సీఐ తోటివారి ముందు అవమానించడంతో.. 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్స్ బరిలోకి దిగాడు. నాలుగుసార్లు విజయం దక్కకపోయినా.. పట్టుదలతో ఐదోసారి 360 ర్యాంకుతో ఐపీఎస్ సాధించాడు. త్వరలో పూర్తి స్థాయి పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టాల్సిన అతను.. ఇప్పుడు ఇలా ఆరోపణలతో ఆత్మహత్యాయత్నం వరకు వచ్చాడు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us