Hyderabad: సెక్యూరిటీ ముసుగులో గంజాయి సరఫరా.. విద్యార్థులే టార్గెట్..

సెక్యూరిటీ ముసుగులో విద్యార్థులు గంజాయి సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఈ వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: సెక్యూరిటీ ముసుగులో గంజాయి సరఫరా.. విద్యార్థులే టార్గెట్..
Hyderabad

Edited By:

Updated on: Oct 31, 2026 | 1:36 PM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు 30 ఏళ్ల బికాష్ సింగ్ అలియాస్ జంగ్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని 24 చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. విచారణలో తన వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసిన 23 మంది పేర్లను అతడు వెల్లడించగా.. వారిలో ఏడుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కస్టమర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు యూనివర్సిటీ దక్షిణ గేటు సమీపంలో గంజాయి ప్యాకెట్లను అందజేసేవాడని ప్రాథమిక విచారణలో తేలింది. సుమారు 200 గ్రాముల గంజాయిని అస్సాంకు చెందిన రైజ్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసి, ఐదు గ్రాముల చొప్పున ప్యాకెట్లు తయారుచేసి రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించేవాడని అధికారులు పేర్కొన్నారు.

అక్టోబర్ 29న ఇద్దరు విద్యార్థులను విచారణ కోసం అదుపులోకి తీసుకోగా.. వారి మూత్ర పరీక్షల్లో టీహెచ్‌సీ (THC) ఆనవాళ్లు గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుంచి లభించిన సమాచారంతో జంగ్‌ను పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది. యూనివర్సిటీ పరిసరాల్లో గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై ఈగల్ ఫోర్స్ దర్యాప్తు విస్తరిస్తోంది. గతంలో మరో కేసులో 24 మంది విద్యార్థులు గంజాయి వినియోగానికి సంబంధించిన విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నల్సార్, గీతం యూనివర్సిటీల్లోనూ మాదకద్రవ్యాల వినియోగంపై విచారణ చేపట్టారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఈగల్ ఫోర్స్ సూచించింది. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉంటే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది

Loading...
Unable to load recommendations.
Follow Us