ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!

తెలంగాణలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలో బైపాస్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఓ సివిల్ కాంట్రాక్టర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.3.50 లక్షలు మాయమయ్యాయి. ఎలాంటి ఓటీపీ, అలర్ట్ మెసేజ్ రాకుండానే నగదు బదిలీ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫోన్ వాడకపోతే ఏమవుతుందిలే అనుకున్నాడు.. బ్యాంక్ ఖాతాలో రూ.3.50 లక్షలు మాయం!
Sangareddy Cyber Crime

Edited By:

Updated on: Nov 21, 2026 | 4:30 PM

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. కనీసం మొబైల్ ఫోన్‌కు ఓటీపీ కూడా రాకుండానే, ఒక సివిల్ కాంట్రాక్టర్ బ్యాంకు ఖాతా నుంచి రూ.3.50 లక్షలు మాయమైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీరంగూడకు చెందిన వెంకన్న వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్. ఆయనకు రామచంద్రాపురంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శాఖలో ఖాతా ఉంది. కాగా, నెల రోజుల క్రితం వెంకన్నకు గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం ఆయన విశ్రాంతి తీసుకుంటుండటంతో గత కొద్ది రోజులుగా తన మొబైల్ ఫోన్‌ను కూడా వినియోగించడం లేదు.

ఇదే అదనుగా భావించారో లేక మరేదైనా సాంకేతిక లోపమో తెలియదు కానీ.. ఈ నెల 14వ తేదీన గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతా నుంచి రూ.3.50 లక్షల నగదును అక్రమంగా వేరే ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అయితే, ఈ లావాదేవీలకు సంబంధించి వెంకన్న మొబైల్ నంబర్‌కు ఎలాంటి ఓటీపీ గానీ, అలర్ట్ మెసేజ్‌లు గానీ రాకపోవడం గమనార్హం.. ఈ నెల 17వ తేదీన వెంకన్న తన బ్యాంకు ఖాతాలోని బ్యాలెన్స్‌ను తనిఖీ చేసుకోగా, అందులో రూ.3.50 లక్షలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఆయన వెంటనే రామచంద్రాపురంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శాఖకు వెళ్లి ఖాతా స్టేట్‌మెంట్, లావాదేవీల వివరాలను పరిశీలించారు. తన ప్రమేయం లేకుండానే డబ్బులు బదిలీ అయినట్లు నిర్ధారించుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే బ్యాంకు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు, అమీన్‌పూర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నగదు ఏ ఖాతాలకు బదిలీ అయిందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

కాగా.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us