
హైదరాబాద్ / అమరావతి: అర్నాబ్, మురసు వరుస తుఫాన్లతో ఏపీ అతలాకుతలమైంది.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. ఈ క్రమంలోనే.. తూర్పు తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు ఉరుముల జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా.. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
శనివారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర – రాయలసీమ: అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ అల్పపీడనం నవంబర్ 15 నాటికి నైరుతి బంగాళాఖాతం వైపు పయనిస్తూ మరింత బలపడే అవకాశముంది. తదుపరి రెండు వారాల వాతావరణ స్థితిగతులపై విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో నవంబర్ 12 నుండి 18 వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందాని వాతావరణ నిపుణులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..