Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన

పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్యకు ప్రభుత్వం కేటాయించిన 600 గజాల నివాస స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలో కేటాయించిన స్థలం కోర్టు వివాదంలో చిక్కుకుపోవడంతో సమస్య మరింత జటిలమైందని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

Darshanam Mogilaiah: పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా?.. కిన్నెర మొగిలయ్య ఆవేదన
Darshanam Mogilaiah

Edited By:

Updated on: Jun 22, 2026 | 6:25 PM

హైదరాబాద్: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్న ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య (కిన్నెర మొగిలయ్య) తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలానికి ఇప్పటికీ పట్టా అందకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. మొగిలయ్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అబ్దుల్లాపూర్ మేట్ మండలం కుంట్లూరు గ్రామంలో 600 గజాల నివాస స్థలం కేటాయించారు. అనంతరం ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంబంధిత జీవో ప్రతిని కూడా అందుకున్నారు. అయితే రెండేళ్లు గడిచినా ఆ స్థలం ఇంకా తన చేతికి రాలేదని మొగిలయ్య వాపోయారు.

తనకు కేటాయించిన భూమి కోర్టు వివాదంలో చిక్కుకోవడంతో సమస్య మరింత జటిలంగా మారిందన్నారు. కేసు పరిష్కారం కోసం న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు సుమారు రూ.9 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్‌డీఓ కార్యాలయం, అబ్దుల్లాపూర్ మేట్ తహసీల్దార్ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు. గత రెండేళ్లలో పలువురు కలెక్టర్లు మారినా తన సమస్య మాత్రం అలాగే ఉందని పేర్కొన్నారు.

తనకు వయస్సు పైబడిందని, జీవితంలో మిగిలిన కొద్దిరోజుల్లో అయినా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని తన నలుగురు పిల్లలకు పంచి ఇవ్వాలనే కోరిక ఉందన్నారు కిన్నెర మొగిలయ్య.. పట్టా రాకపోవడంతో కుటుంబ సభ్యుల వద్ద కూడా అవమానాలు ఎదుర్కొంటున్నానని చెప్పారు. స్థానిక స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని కోరతానని కిన్నెర మొగిలయ్య స్పష్టం చేశారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న కళాకారుడికి ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇప్పటికీ అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us