Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. MMTS స‌ర్వీసుల‌పై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలను అందించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడూ కీలక నిర్ణయాలు తీసుకంటూ ఉంటుంది. తాజాగా ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌పై శాన‌స‌మండ‌లి హాల్‌లో నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవ‌లు ఉండేలా చూడాలన్నారు.

Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. MMTS స‌ర్వీసుల‌పై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad Mmts

Updated on: Mar 26, 2026 | 6:00 PM

ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌పై శాన‌స‌మండ‌లి హాల్‌లో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. హైద‌రాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని ఆయన సూచించారు. ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల త‌గ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో పాటు క్రమం త‌ప్పకుండా స‌మ‌య పాల‌న పాటిస్తూ స‌ర్వీసులు న‌డ‌పాల‌ని సీఎం ఆదేశించారు.

ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్దకు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం, స్టేష‌న్లు లోప‌లికి ఉన్నందున అక్కడ‌కు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్లలో ప్రయాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు. మెరుగైన వ‌స‌తులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతార‌ని సీఎం తెలిపారు.

స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకునేందుకు ప్రయ‌త్నించాల‌ని అధికారుల‌కు సీఎం సూచించారు. లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, వ‌స‌తులు మెరుగుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్యయ‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

స‌మీక్షలో రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కె.రామ‌కృష్ణారావు, ఎంఏయూడీ స్పెష‌ల్ సెక్రట‌రీ జయేష్‌ రంజ‌న్‌, ఆర్ అండ్ బీ వికాస్ రాజ్‌, సీఎం స్పెష‌ల్ సెక్రట‌రీ అజిత్ రెడ్డి, సీఎం కార్యద‌ర్శి మాణిక్‌రాజ్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆర్‌.వి.కర్ణన్‌, హెచ్‌యూఎంటీఏ ఎండీ జీవ‌న్ బాబు, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే డీసీఎం చ‌ర‌ణ్ నాయ‌క్ పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us