
హైదరాబాద్‌లో ఆహార భద్రత ప్రమాణాలు పాటించని రెస్టారెంట్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. కాలం చెల్లిన ఆహార పదార్థాల వినియోగం, వంటశాలల్లో తీవ్రమైన అపరిశుభ్రత, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 8 ప్రముఖ ఆహార విక్రయ కేంద్రాలు/రెస్టారెంట్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ విభాగం నగరవ్యాప్తంగా దాదాపు 200కి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, తినుబండారాల కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల సందర్భంగా పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కాలం చెల్లిన ఆహార పదార్థాలు: చాలా రెస్టారెంట్లలో ఎప్పుడో గడువు ముగిసిన మసాలాలు, సాస్‌లు, పాడైపోయిన చికెన్, మటన్, ఇతర ఆహార దినుసులను ఉంచి వంటకాల తయారీకి ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అత్యంత అపరిశుభ్రమైన వంటశాలలు: కిచెన్ పరిసరాలు ఈగలు, బొద్దింకలు, మరియు మురికి నీటితో నిండి ఉండటం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా చోట్ల ఆహార పదార్థాలను మూతలు లేకుండా తెరిచి ఉంచారు.
లైసెన్స్ లేకపోవడం: కొన్ని సంస్థలు కనీస ఫుడ్ సేఫ్టీ (FSSAI) లైసెన్సులు లేదా రిజిస్ట్రేషన్లు లేకుండానే అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తేలింది.
సరిపడా శుభ్రత పాటించకపోవడం, పాడైపోయిన నిల్వలను ఉపయోగించడం వంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన 8 ఆహార కేంద్రాల లైసెన్సులను అధికారులు రద్దు చేయడమే కాకుండా, పలు ఇతర రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే భారీగా జరిమానాలు కూడా విధించారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. హోటళ్లు మరియు రెస్టారెంట్ల నిర్వాహకులు కిచెన్ శుభ్రత, నాణ్యమైన దినుసుల వాడకం, ఉద్యోగుల పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇకపై కూడా నగరంలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే సీజింగ్ తో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రజలు కూడా బయట తినేటప్పుడు పరిశుభ్రతను గమనించాలని, ఏవైనా నాణ్యతా లోపాలు ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..