Ghatkesar News: హైదరాబాద్ నగర పరిధిలోని ఘట్‌కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. నాలుగేళ్ల పాప కృష్ణవేణిని రైల్వే పోలీసులు సురక్షితంగా కాపాడాడు. పాపను ఎత్తుకెళ్లిన కిడ్నాపర్ సురేష్ ను గుర్తించిన రైల్వే పోలీసులు పాపను రక్షించి.. నిందితుడు సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నాలుగేళ్ల బాలిక కృష్ణవేణి నిన్నరాత్రి దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో బాలిక కిడ్నాప్‌కు గురైంది. చుట్టుపక్కల వేతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి నుంచి ముమ్మరంగా గాలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఓ సీసీ కెమెరాలో నిందితుడు సురేష్ పాప ఎత్తుకుని వెళ్తున్నట్లు గుర్తించి ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. పలు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు నగర పరిధిలోని అన్ని పోలీస్ స్టేషనను అలర్ట్ చేశారు. పోలీసులతోపాటు.. సుమారు 500 మంది పాప కోసం గాలించారు.
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ సిబ్బందిని అలెర్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే.. సికింద్రాబాద్ స్టేషన్‌లో పాపను సేఫ్‌గా కాపాడారు రైల్వే పోలీసులు. నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి పాపను ఘట్కేసర్ తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాచకొండ సీపీ చౌహన్ ఘట్కేసర్ చేరుకున్నారు. పాప ఇంటికి వెళ్లి సీపీ చౌహన్ పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..