కంపుకొడుతున్న హైదరాబాద్‌ క్లౌడ్ కిచెన్లు.. లైసెన్సులు సస్పెండ్! ఎటు చూసినా బొద్దింకలు, ఎలుకల వ్యర్ధాలే

హైదరాబాద్‌లో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, క్లౌడ్ కిచెన్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నగరంలోని 23 రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లలో తనిఖీలు నిర్వహించగా బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటగదులు బయటపడ్డాయి. దీంతో ఎనిమిది సంస్థల FSSAI లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. సుమారు 700 కిలోల కలుషిత ఆహార పదార్థాలను పారవేశారు. అసలు ఏయే హోటళ్లపై చర్యలు తీసుకున్నారు? తనిఖీల్లో ఎలాంటి లోపాలు బయటపడ్డాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

కంపుకొడుతున్న హైదరాబాద్‌ క్లౌడ్ కిచెన్లు.. లైసెన్సులు సస్పెండ్! ఎటు చూసినా బొద్దింకలు, ఎలుకల వ్యర్ధాలే
Major Food Safety Violations In Hyderabad Restaurants

Updated on: Nov 11, 2026 | 10:49 AM

హైదరాబాద్‌, నవంబర్ 11: హైదరాబాద్‌లో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లు, క్లౌడ్ కిచెన్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. నగరంలోని పలు రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లలో తనిఖీలు నిర్వహించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంటగదుల్లో బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం కనిపించడంతో ఎనిమిది సంస్థల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని CURE ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులకు చెందిన మొత్తం 24 బృందాలు పాల్గొన్నాయి. నగరంలోని 23 క్లౌడ్ కిచెన్లు, రెస్టారెంట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కల్తీ జరిగి ఉండవచ్చనే అనుమానంతో 25 ఆహార నమూనాలను సేకరించారు. సుమారు 700 కిలోల వరకు పాడైపోయిన, కలుషితమైన ఆహార పదార్థాలను గుర్తించి అక్కడికక్కడే పారవేశారు.

లైసెన్సులు సస్పెండ్ అయిన సంస్థలివే..

తనిఖీల్లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించడంతో కింది ఎనిమిది సంస్థల లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు.

  • బిర్యానీ బై కిలో – గచ్చిబౌలి
  • కుల్చా కల్చర్ – మాదాపూర్
  • లక్కీ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ – సోమాజిగూడ
  • టమ్ యమ్ ఇన్నోవిజన్స్ – మాదాపూర్
  • జోరా 11/2 – ఖైరతాబాద్
  • ఎల్‌ఓ ఫ్రెష్ ఫుడ్స్ – మాదాపూర్
  • ఐటీసీ ఆశీర్వాద్ సోల్ క్రియేషన్స్ క్లౌడ్ కిచెన్ – గచ్చిబౌలి
  • సోడెక్సో ఇండియా సర్వీసెస్ – కొండాపూర్

పలు సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. కొన్ని చోట్ల పాడైపోయిన అన్నం, పురుగులు పట్టిన పిండి పదార్థాలు, బొద్దింకలు, ఎలుకల వ్యర్థాలు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను కూడా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా వంటగది పరికరాలు అపరిశుభ్రంగా ఉండటం, కూరగాయలకు ఫంగస్ పట్టడం, శాకాహారం, మాంసాహారాన్ని సరైన పద్ధతిలో వేర్వేరుగా నిల్వ చేయకపోవడం వంటి ఉల్లంఘనలు బయటపడ్డాయి. డ్రైనేజీలు పూడుకుపోవడం, ఎగ్జాస్ట్ వ్యవస్థల్లో జిడ్డు పేరుకుపోవడం, ఆహారం తయారు చేసే సిబ్బంది రక్షణ పరికరాలు ధరించకపోవడం వంటి లోపాలను కూడా అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించిన మరో 10 సంస్థలకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా లోపాలను సరిదిద్దుకోవాలని మరో ఐదు సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందించారు. సంబంధిత సంస్థల్లో మళ్లీ తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటిస్తున్నాయో లేదో పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అవసరమైతే జరిమానాలతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. లైసెన్సులు సస్పెండ్ చేసిన ఎనిమిది సంస్థలు తక్షణమే తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం తినే ముందు పరిశుభ్రతపై కూడా వినియోగదారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us