Hyderabad: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు చెక్ చేయాలనుకున్నాడు.. తీరా ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూడగా

బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌లో రూ.6.5 కోట్ల భారీ మోసం వెలుగుచూసింది. ఓ ఎన్ఆర్ఐ ఖాతా నుంచి నగదు కాజేసిన కేసులో బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో మరికొంతమంది ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Hyderabad: బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు చెక్ చేయాలనుకున్నాడు.. తీరా ఫోన్‌కు వచ్చిన మెసేజ్ చూడగా
Money

Updated on: Apr 13, 2026 | 11:42 AM

హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్ బ్యాంక్ శాఖలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ఒక ఎన్ఆర్ఐ ఖాతా నుంచి ఏకంగా రూ.6.5 కోట్ల నగదును బ్యాంక్ సిబ్బంది అనధికారికంగా దారి మళ్లించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు ఈ కుట్రను ఛేదించి, కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బాధితుడు విదేశాల్లో ఉన్న సమయంలో అతని ఖాతాలో ఉన్న భారీ మొత్తాన్ని బ్యాంక్ అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఫోర్జరీ సంతకాలు లేదా పర్సనల్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించి రూ.6.5 కోట్లను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సమాచారం. తన అకౌంట్ నుంచి నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ప్రాథమిక ఆధారాల మేరకు బేగంపేట యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను అరెస్ట్ చేశారు. ఈ మోసంలో వెంకటరమణ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు కేవలం ఒక్క ఖాతానే కాకుండా, మరికొంతమంది ఖాతాదారుల నగదును కూడా ఇదే తరహాలో మాయం చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో ఆరోపించడం గమనార్హం. ఒక్క మేనేజర్ స్థాయి అధికారి ఇంత భారీ మొత్తాన్ని మళ్లించడం సాధ్యం కాదని భావిస్తున్న పోలీసులు, ఈ కుంభకోణంలో బ్యాంక్ సీనియర్ అధికారుల ప్రమేయంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇతర సిబ్బంది ఎవరైనా ఈ కుట్రలో భాగస్వాములయ్యారా? అనే కోణంలో బ్యాంక్ లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నారు. నిందితుడి వద్ద నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..

Follow Us