ఆసిఫ్‌నగర్‌లో భారీ దొంగతనం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 70 తులాల బంగారం మాయం!

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ జేబా బాగ్ ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఆసిఫ్‌నగర్‌లో భారీ దొంగతనం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 70 తులాల బంగారం మాయం!
Gold Stolen

Updated on: Nov 28, 2026 | 12:23 PM

 

హైదరాబాద్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయాన్ని అదునుగా చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 70 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లి బాధిత కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ జేబా బాగ్ డీ-క్లాస్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహమ్మద్ వాసిం అనే వ్యక్తి ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. నవంబర్ 27వ తేదీ సాయంత్రం వాసిం కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించారు.

అనంతరం ఇంట్లోని బీరువాను తెరిచి అందులో భద్రపరిచిన సుమారు 70 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. చోరీ అనంతరం అక్కడి నుంచి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా పరారయ్యారు. కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు? చోరీకి పాల్పడిన అనంతరం ఏ మార్గంలో వెళ్లారు? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఒకేసారి 70 తులాల బంగారం చోరీకి గురికావడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us