సూపర్ గుడ్‌న్యూస్.. హైదరాబాద్–విజయవాడ ప్రయాణం మరింత ఈజీ.. హైవేపై సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి NH-65ను ఆరు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. దండు మల్కాపురం–నందిగామ సెక్షన్‌లో సిక్స్ లేనింగ్‌తో పాటు సర్వీస్ రోడ్లు, వాహన అండర్‌పాస్‌లు, VUPలు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. NHAI ఇప్పటికే NH-65పై బ్లాక్‌స్పాట్ల సరిదిద్దడం, జంక్షన్ మెరుగుదలలు, అండర్‌పాస్ వంటి భద్రతా పనులను కూడా చేపట్టింది.

సూపర్ గుడ్‌న్యూస్.. హైదరాబాద్–విజయవాడ ప్రయాణం మరింత ఈజీ.. హైవేపై సర్వీస్ రోడ్లు, అండర్‌పాస్‌లు
Hyderabad Vijayawada Highway

Edited By:

Updated on: Sep 24, 2026 | 7:24 AM

తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే హైదరాబాద్ – విజయవాడ హైవేపై వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎంతో కీలకమైన ఈ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరణలో కీలక ముందడుగు పడింది. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ – విజయవాడ హైవేపై నిత్యం రక్తసిక్తమవుతోంది. ఈ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు హైవేను ఆరు లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తెలంగాణ – ఏపీ రాష్ట్రాలకు జాతీయ రహదారి నెం.65 కీలకమైనది. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ ఉన్న 181.50 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేను ఆరు లైన్లుగా విస్తరించేందుకు 2010లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) జీఎమ్మార్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును రూ.1740 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించింది. ఆ సమయంలోనే ఆరులేన్ల రహదారికోసం భూసేకరణ చేశారు. 2012లో జీఎమ్మార్.. పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేస్తోంది. టోల్ వసూలు లో నష్టాలు వస్తున్నాయంటూ జిఎంఆర్ సంస్థ హైవే నిర్వహణ నుంచి తప్పుకుంది.

ప్రమాదాలకు అడ్డగా.. ఎన్ హెచ్ 65..

నిత్యం ప్రమాదాలతో ఈ హైవే రక్తసిక్తంగా మారుతోంది. ఈ హైవేపై ప్రతిరోజూ 60 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సెలవు పండుగ దినాల్లో ఈ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా పేరుంది. మరోవైపు నిత్యం ప్రమాదాలతో ఈ హైవే ఆక్సిడెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీంతో ఈ హైవేను ఆరు లైన్లుగా విస్తరించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ హైవేని ఎట్టకేలకు ఆరులేన్ల రహదారిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

రెండు ప్యాకేజీలుగా..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం నుండి ఏపీలోని మచిలీపట్నం వరకు హైవేని ఆరు లైన్లుగా విస్తరించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రెండు ప్యాకేజీలుగా విభజించింది. ఇందులో దండు మల్కాపురం నుండి నుంచి నందిగామ మధ్య 181 కిలోమీటర్లు, విజయవాడ నుంచి మచిలీపట్నం మధ్య 59 కిలోమీటర్లుగా రెండు ప్యాకేజీలుగా చేసింది. ఆరు లైన్లుగా బీవోటీ, హ్యామ్ కింద పనులు చేపట్టాలని NHAI నిర్ణయించింది. రెండు ప్యాకేజీలుగా బిడ్లను ఆహ్వానిస్తూ NHAI టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పనులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం కోసం త్వరలోనే ఈ కమిటీ ముందుకు ఈ ప్రాజెక్టు ఫైల్ వెళ్లనుంది. అక్కడ అనుమతులు వచ్చే లోపు, టెండర్ల ప్రక్రియ ఆరంభించినట్లు ఎన్ హెచ్ఎఐ వర్గాలు తెలిపాయి.

వీయూపీలు, అండర్ పాస్ ల నిర్మాణం..

ఈ హైవేపై ప్రమాదాల నివారణకు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. మల్కాపూర్ నుంచి నందిగామ వరకు చేపట్టే మొదటి ప్యాకేజీలో ఆరు లైన్ల విస్తరణ, సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం సివిల్ పనులకు రూ.6,792.52 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఈ ప్యాకేజీలో మల్కాపూర్ సమీపం నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, నవాబుపేట, నందిగామ వరకు విస్తరణ పనులు జరుగుతాయి. ఇందులో 60 వాహనాల అండర్ పాస్ లు, 65 (వీయూపీలు), జంతువులు రోడ్డు దాటడానికి మరో 10 అండర్ పాసులు నిర్మిస్తారు. బీవోటీ విధానంలో చేపట్టే ఈ పనుల కోసం నవంబరు 23 వరకు బిడ్ల దాఖలుకు గడువు ఇచ్చారు. నవంబరు 25న బిడ్లు తెరవనున్నారు.

రెండో ప్యాకేజీలో విజయవాడ శివారులో ప్రాంతాల్లో ప్రస్తుతం 46 కి.మీ. మేర విస్తరణకు ప్రస్తుతం టెండర్లు పిలవలేదు. ఈ ప్యాకేజీలో హైవే నిర్వహణ బాధ్యతలు చూస్తున్న గుత్తేదారు సంస్థకు 2031 వరకు గడువు ఉంది. హ్యామ్ కింద విజయవాడ- మచిలీపట్నం మధ్య 45 కిలోమీటర్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు.

భూసేకరణకు నోటిఫికేషన్..

హైదరాబాద్-నందిగామ మధ్య విస్తరణకు సంబంధించి అవసరమైన భూసేకరణకు ఎన్‌హెచ్ఎఐ నోటిఫికేషన్ జారీచేసింది. చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల పరిధిలో కేవలం 6.32 హెక్టార్ల భూములను సేకరించాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us