
Hyderabad Rain Alert: హైదరాబాద్లో మంగళవారం నుంచి గురువారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ పెరగకుండా, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలకు కీలక సూచనలు జారీ చేశారు.
మంగళవారం విడుదల చేసిన అడ్వైజరీలో భాగంగా.. మూడు రోజుల పాటు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు దశలవారీగా ముందుగానే లాగ్అవుట్ (Early Logout) సౌకర్యం కల్పించాలని పోలీసులు కోరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఉద్యోగులను విడతలవారీగా ఇళ్లకు పంపించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను వీలైనంత వరకు సాయంత్రం 4 గంటలలోపు పూర్తి చేయాలని తెలిపారు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉద్యోగులు ప్రయాణించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడం, రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడిని నియంత్రించడం ఈ సూచనల ప్రధాన ఉద్దేశమని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు అత్యవసర సేవలకు చెందిన వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు, ఈ మూడు రోజుల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) అవకాశం కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఐటీ సంస్థలకు సూచించారు. అవసరమైతే కార్యాలయాలకు రావాల్సిన ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు.
అలాగే, ట్రాఫిక్ నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ కార్యాలయాల చిరునామాలు, ఉద్యోగులకు అమలు చేయనున్న ముందస్తు లాగ్అవుట్ సమయాల వివరాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు పంపించాలని కోరారు. ఇందుకోసం cybtrcc@gmail.com అనే ఈ-మెయిల్ చిరునామాకు వివరాలు పంపించాలని సూచించారు.
వర్షాల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రయాణ ప్రమాదాలు తగ్గించేందుకు ఐటీ సంస్థలు పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు.