
హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జ్‌లో మహిళ మృతదేహం లభ్యమవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. చందానగర్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని నైట్ ఐ లాడ్జ్ లో ఆదివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో సిబ్బందికి అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. అది చూసి షాక్ అయిన సిబ్బంది వెంటనే చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక పరిశీలనలు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇందిరేశం గ్రామానికి చెందిన శంకర్ భార్య నర్సమ్మ (39)గా గుర్తించారు. అయితే నర్సమ్మకు గత కొన్ని రోజులుగా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. అతనితో ఉన్న చనువుతోనే ఆమె చందానగర్‌లోని నైట్ ఐ లాడ్జ్ వరకు వచ్చి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కుమార్ అనే వ్యక్తే ఆమెను హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో లాడ్జ్ గది పరిస్థితి, మృతురాలి శరీరంపై ఉన్న గాయాల మొదలైన అంశాలు సాధారణ మృతిలా కాకుండా, హత్యా చేసినట్టు అనిపించడంతో ఈ కేసును హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతురాలు ఏ సమయానికి లాడ్జ్‌కు వచ్చింది, ఆ రాత్రి గదిలో ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకునేందుకు CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.