
హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం విధులకు హాజరైన ఓ పోలీస్ ఎస్సై రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్ద జరిగిన ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న వెంకన్న గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 2 వద్ద ఆయన విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం (సెప్టెంబర్ 23) తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో గుర్తుతెలియని బైక్ ఆయనను ఢీకొట్టి పారిపోయింది. ఈ ప్రమాదంలో వెంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం అనంతరం సమీప ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. పోలీస్ ఉన్నతాధికారుల సూచనల మేరకు వెంకన్నను కొత్తగూడెంలోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న సమయంలో శరీరంలో నొప్పులు తీవ్రంగా ఉన్నాయని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో వెంకన్న మృతి చెందారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురై ఎస్సై ప్రాణాలు కోల్పోవడం పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వెంకన్నను ఢీకొట్టిన బైక్ వివరాలు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, సహచర పోలీసులు ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…