
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సింగూరు–మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న దృష్ట్యా హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) గోదావరి అదనపు జలాలను నగరానికి తరలించేందుకు ఘన్ పూర్ వద్ద చేపడుతున్న పైప్‌లైన్ అనుసంధాన పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 15వ తేదీలోగా పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తి చేసి, గోదావరి జలాలను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువును ఒక్కరోజు కూడా పొడిగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
పైప్‌లైన్ నిర్మాణ పనులను రెండు వైపుల నుంచి సమాంతరంగా చేపట్టి, నిర్ణీత గడువులోగా అనుసంధానం చేయాలని ఎండీ ఆదేశించారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత దూరం పైప్‌లైన్ ఏర్పాటు చేసిందనేది ముఖ్యం కాదని, పనులు పూర్తయి పైప్‌లైన్ అనుసంధానం కావడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పనుల పరిధికి సంబంధించిన బిల్లుల సర్దుబాటును తర్వాత పరిశీలించవచ్చని, ప్రస్తుతం పనుల పూర్తికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పైప్‌లైన్ అనుసంధాన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు రోజుకు ఎనిమిది గంటల చొప్పున మూడు షిఫ్టుల్లో ప్రత్యేక కార్మిక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి షిఫ్టుకు వేర్వేరు బృందాలను నియమించి, పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరాయంగా పనులు కొనసాగించాలన్నారు. రాత్రివేళ పనులకు అవసరమైన ఫ్లడ్‌లైట్లు, యంత్ర సామగ్రి, ఇతర సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారు.
పైప్‌లైన్ అనుసంధానానికి కీలకమైన రోడ్డు క్రాసింగ్ పనులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఎండీ ఆదేశించారు. అవసరమైన అనుమతులు, భద్రతా ఏర్పాట్లతో రాత్రి నుంచే రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించి, రెండు మూడు రోజుల్లో పైపుల ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని సూచించారు. ఇందుకోసం అదనంగా రెండు మూడు ప్రత్యేక కార్మిక బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు.
గోదావరి జలాల తరలింపునకు చేపడుతున్న పనులను వేగవంతం చేసేందుకు మిషన్ భగీరథ, అటవీశాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. పైప్‌లైన్ అనుసంధానానికి అవసరమైన సాంకేతిక సహకారం, యంత్రాలు, మానవ వనరులను ఆయా శాఖల సహకారంతో సమకూర్చుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న గోదావరి ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైన సాంకేతిక నిపుణులు, కార్మిక బృందాలు, ఎక్స్‌కవేటర్లు, డ్రిల్లింగ్ యంత్రాలు, ఇతర భారీ యంత్ర సామగ్రిని అవసరమైన మేరకు ఈ పనులకు మళ్లించాలని సూచించారు. అవసరమైతే ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న పనులను తాత్కాలికంగా నిలిపివేసి, అక్కడి యంత్రాలు, వాహనాలు, సిబ్బందిని ఈ ప్రాజెక్టుకు వినియోగించుకోవాలన్నారు.
రాబోయే వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరిగే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ఎండీ సూచించారు. ముఖ్యంగా సింగూరు–మంజీరా జలవనరులపై ఆధారపడిన ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను అందించే ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పైప్‌లైన్ అనుసంధాన పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని, ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికావడం జలమండలి ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని, అధికారులు, నిర్మాణ సంస్థలు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.
నవంబర్ 15వ తేదీలోగా పైప్‌లైన్ అనుసంధాన పనులు పూర్తి చేసి, రోజుకు 40 ఎంజీడీల గోదావరి అదనపు జలాల సరఫరాకు మార్గం సుగమం చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..