
మూసాపేట / అల్లాపూర్: అతనో మెకానిక్.. డబ్బులున్న మహిళలను టార్గెట్ చేస్తాడు.. యాప్‌లో పరిచయమై.. కోట్లు ఉన్నాయంటూ బిల్డప్ కొడతాడు.. చివరకు, ఏది దొరికితే అది ఎత్తుకు వెళతాడు.. ఈ షాకింగ్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. సోషల్ యాప్‌ల ద్వారా పరిచయమై, తాను భారీ సంపన్నుడినని నమ్మిస్తూ మహిళల నుంచి బంగారు ఆభరణాలు కాజేస్తున్న యువకుడిని అల్లాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా కుక్కునూర్ మండలం ఇబ్రహీంపేటకు చెందిన పేట వసంత్ (25) కారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ‘ఫ్రెండ్ యాప్’ ద్వారా ఆర్థికంగా స్థితిమంతులైన మహిళలను లక్ష్యంగా చేసుకుని, స్నేహం ముసుగులో మోసాలకు పాల్పడటాన్ని అలవాటుగా మార్చుకున్నాడు.
అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు (35)కి ఫ్రెండ్ యాప్‌లో వసంత్ పరిచయమయ్యాడు. మాటలతో ఆమెను దగ్గర చేసుకున్న నిందితుడు, వీడియో కాల్స్ చేస్తున్న సమయంలో తన మెకానిక్ షెడ్డుకు వచ్చిన ఖరీదైన కార్లను చూపిస్తూ అవి తన సొంత కార్లని నమ్మించాడు. అంతేకాకుండా సూటుబూటు వేసుకుని, టేబుల్‌పై నోట్ల కట్టలు పేర్చి వీడియో కాల్లో ప్రదర్శించేవాడు. వసంత్ మాటలు, ఆడంబర ప్రదర్శనను నిజమేనని నమ్మిన బాధితురాలు ఇటీవల తన ఇంటికి రావాల్సిందిగా అతడిని ఆహ్వానించింది.
ఖరీదైన కారులో వచ్చిన వసంత్, ఆ గృహిణిని పలు ప్రాంతాలకు కారులో తిప్పాడు. అనంతరం మాయమాటలు చెప్పి, ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని ఇస్తే మరుసటి రోజు తిరిగి ఇస్తానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మి ఆమె మంగళసూత్రం ఇవ్వగా, నిందితుడు అక్కడి నుంచి జారుకున్నాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అల్లాపూర్ పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు వసంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 20 గ్రాముల మంగళసూత్రం, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నవీన్‌కుమార్ తెలిపారు.