హైదరాబాద్‌లో కలవరపెడుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు.. రెండు వారాల్లో ఆరుగురు.. కారణాలివేనా?

Hyderabad IT Employee Suicides: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 12 నుంచి 27 మధ్య ఆరుగురు ఐటీ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఉద్యోగుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు అవసరమో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో కలవరపెడుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు.. రెండు వారాల్లో ఆరుగురు.. కారణాలివేనా?
Software Employee Stress

Updated on: Oct 30, 2026 | 1:10 PM

Hyderabad IT Employee Suicides: ఐటీ రంగంలో ఉద్యోగం సాధించాలని ఎంతోమంది యువత కలలు కంటారు. మంచి జీతం, మెరుగైన జీవనశైలి, కెరీర్‌లో ఎదుగుదల వంటి అవకాశాలు ఈ రంగం వైపు ఆకర్షిస్తాయి. అయితే, ఉద్యోగంలో చేరిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు, వ్యక్తిగత బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు కొందరికి తీవ్ర మానసిక ఇబ్బందులను కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు ఈ అంశంపై మరోసారి చర్చకు దారితీశాయి. అక్టోబర్ 12 నుంచి 27 మధ్య ఆరుగురు ఐటీ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరిలో చాలామంది 35 ఏళ్లలోపు వారే కావడం విషాదకరం.

ఈ ఘటనల్లో విశాఖపట్నానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉదంతం కూడా చర్చనీయాంశమైంది. స్నేహితులను కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన దుర్గం చెరువు బ్రిడ్జి పైనుంచి దూకేశాడు. ఇలాంటి ఘటనలు ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, వారికి అందుతున్న సహకారం, పని ప్రదేశాల్లోని పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

అధిక జీతాలు ఉన్నా ఆర్థిక ఒత్తిళ్లు తప్పడం లేదా?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మంచి వేతనాలు లభిస్తున్నప్పటికీ, పెరుగుతున్న జీవన వ్యయం వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. ఇంటి అద్దెలు, గృహ రుణాల ఈఎంఐలు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులను నిర్వహించడం కొందరికి భారంగా మారుతోంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు పెరిగినప్పుడు ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత సాధించడం సవాలుగా మారవచ్చు.

మరోవైపు, సంస్థల్లో పనితీరు లక్ష్యాలను చేరుకోవడం, ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తి చేయడం, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం వంటి అంశాలు ఉద్యోగులపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఉద్యోగ భద్రతపై అనిశ్చితి, కెరీర్‌లో వెనుకబడిపోతామనే భయం కూడా కొందరిని ఆందోళనకు గురిచేయవచ్చు. పని ఒత్తిడి, నిద్రలేమి, ఒంటరితనంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు బాధపడుతున్నారు. వీటిని అధిగమించలేక వ్యసనాల బారినపడుతున్నారు. ఈ క్రమంలోనే శారీరక, మానసిక ప్రశాంతత, కుటుంబ సంబంధాలు కోల్పోయి ప్రతికూల దోరణితో ఆలోచిస్తున్నారు. పనివేళలు, వ్యక్తిగత సమయం మధ్య స్పష్టమైన హద్దులు నిర్ణయించుకోవడం దీనికి సరైన పరిష్కారమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పని గంటలను సమతుల్యం చేయడం, విశ్రాంతికి తగిన సమయం ఇవ్వడం, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ అందించడం వంటి చర్యలు ఉపయోగపడవచ్చు. ఉద్యోగులు కూడా సమస్యలను ఒంటరిగా ఎదుర్కోకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం ముఖ్యం.

తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిరాశ లేదా నిస్సహాయత ఎదురైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవాలి. భారత ప్రభుత్వ టెలీ-మానస్ మానసిక ఆరోగ్య సేవలను 14416 నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us