హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హనుమకొండ బాల సముద్రంలోని కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి అనుమతులు లేవంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కాజీపేట సర్కిల్ నుండి ఈ నోటీసులు జూన్ 25వ తేదీన జారీ అయ్యాయి. నోటీసులు జారీ సమాచారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జీడబ్ల్యూఎంసీ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను మూడు రోజుల్లో అనుమతి పాత్రలు అందజేయాలని పేర్కొంది. లేదంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తందని మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీస్ లో పేర్కొన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అన్ని జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించింది. ప్రభుత్వ స్థలాలను తీసుకుని ఆయా కార్యాలయాలు నిర్మాణం చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ పార్టీ ఆఫీసుకు మాత్రం అనుమతులు లేవని నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. అంతే కాదు పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను సమర్పించాలని మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ఆదేశించారు. నోటీసుల సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు కేవలం మూడు రోజులు గడువు మాత్రమే ఇచ్చారు. దాదాపుగా వారం పూర్తయింది.ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..