కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల దాడులతో అచ్చంపేట నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.దాడి ఘటనలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నియోజకవర్గంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో బీఆర్ఎస్,కాంగ్రెస్ వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. డబ్బుల బ్యాగులు తరలిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అనుమానిస్తున్న ఓ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగింది. దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు వాహనాన్ని తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. తమ వాహనాలను ఆపడానికి మీరెవరు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది.ఇరుపార్టీలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి.
ఘర్షణ వార్త తెలుసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ ఘటనాస్థలికి చేరుకోవడంతో గువ్వల బాలకృష్ణ, వంశీకృష్ణల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలోనే వంశీ కృష్ణ రాయి తీసుకొని బాలరాజు పైకి విసరడంతో కుడివైపు దవడకు తగిలి గాయమైనట్టు అక్కడున్న వారు చెబుతున్నారు. దాడితో స్పృహతప్పి పడిపోయిన బాలరాజును హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడి జరుగుతుందనే అనుమానంతో పది రోజుల కిందనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చానంటున్నారు గువ్వల బాలరాజు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే బాలరాజు డ్రామా ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ వంశీకృష్ణ. రాష్ట్రంలో దాడుల సంస్కృతిని ప్రవేశపెడితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయేనంటూ హెచ్చరించారు మంత్రి కేటీఆర్. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్, ఇరుపార్టీల కార్యకర్తల వద్ద ఉన్న వీడియోలను సేకరించే పనిలో పడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దాడులతో నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అచ్చంపేటలో కవాతు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..