Custard Apple: ఎల్ నినో దెబ్బ.. అందని ద్రాక్షగా మారిన సీతాఫలం.. మార్కెట్‌లో కనిపించని జాడ

ఎల్‌నీనో ప్రభావం వర్షాలు, వ్యవసాయంపై మాత్రమే పడిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది సీజనల్ పండ్లపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ప్రభావంతో శీతాకాలంలో ఇప్పటికే రావాల్సిన సీతాఫలాలు కనుమరుగవుతున్నాయి. అసలు ఈ ఎల్‌నీనో ప్రభావం సీతాఫలం సాగుపై ఎలా పడుతోంది? మన రాష్ట్రంలో ప్రస్తుతం సీతాఫలం సాగు ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో ఇక్కడ స్పష్టంగా తెలుసుకుందాం.

Custard Apple: ఎల్ నినో దెబ్బ.. అందని ద్రాక్షగా మారిన సీతాఫలం.. మార్కెట్‌లో కనిపించని జాడ
Why Custard Apples Are Missing This Winter

Updated on: Oct 17, 2026 | 11:53 AM

శీతాకాలం ప్రారంభమైందంటే చాలు పల్లె గుట్టల్లో, రోడ్ల వెంట, మార్కెట్లలో సీతాఫలాలు కళకళలాడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీతాఫలం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిపోయింది. చలికాలం మొదలై దాదాపు నెల కావస్తున్నా ఇంకా మార్కెట్లో సీతాఫలాల జాడ మాత్రం కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం కాపు తగ్గిపోవడం. అవును, ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు లేక, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెట్లకు పట్టిన పూత పిందె దశకు కూడా రాకముందే వాడిపోతోంది.

దీనివల్ల దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. దానికి తోడు చాలా ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో సహజంగా పెరిగే చెట్లను నరికివేయడంతో సీతాఫలాల దిగుబడి మరింత పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సీతాఫలాల సాగు కొనసాగుతోంది. అయితే అక్కడి నుంచి మార్కెట్‌కు వచ్చే పండ్లకు కూడా డిమాండ్ భారీగా పెరిగిపోయింది. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం మార్కెట్లో సీతాఫలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో పండు నాణ్యతను బట్టి రూ.30 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు వీటిని కొనేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు.

పూత దశలోనే దెబ్బ

సాధారణంగా వర్షాకాలంలో కురిసే వర్షాల వల్ల భూమిలో తేమ పెరిగి, శీతాకాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా సీతాఫలాల దిగుబడి ఉంటుంది. ఇవి ఎక్కువగా కాయాలంటే వర్షంతో పాటు నేలలో తేమ కూడా చాలా అవసరం. కానీ గడిచిన వర్షాకాల సీజన్‌లో వర్షాలు లేకపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరగడంతో చెట్టుకు పూసిన పూత పిందె దశకు చేరకుండానే నేలరాలిపోతోంది. కొన్ని చెట్లు ఈ దశను దాటి కాయ వరకు వచ్చినా, ఆ తర్వాత ఎండిపోయి రాలిపోతున్నాయి. దీనివల్ల సాధారణంగా చెట్టుకు 50-60 వరకు కనిపించాల్సిన కాయలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి.

ఇది కూడా ప్రధాన కారణం..

సీతాఫలాల లభ్యత తగ్గడానికి కేవలం వాతావరణ పరిస్థితులు మాత్రమే కారణం కాదు. సీతాఫలం చెట్లు ఎక్కువగా పెరిగే ప్రాంతాలను అభివృద్ధి పేరుతో చదును చేసి వెంచర్లు వేయడం, కళాశాలలు, భవనాలు నిర్మించడం కూడా వాటి ఉత్పత్తికి ఆటంకంగా మారింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సీతాఫలాల లభ్యత మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us