
పెళ్లంటే భారీ ఖర్చులు, హంగులు, రంగురంగుల అలంకరణలు, వందల రకాల వంటకాలు.. ఇవే గుర్తొస్తాయి. కానీ ఓ రైతు మాత్రం తన కుమార్తె వివాహాన్ని ప్రకృతికి దగ్గరగా, పర్యావరణానికి హాని కలగని రీతిలో నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్లాస్టిక్‌కు దూరంగా, సేంద్రియ ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ సాగిన ఈ వివాహ వేడుక.. ప్రకృతి ప్రేమకు, సంప్రదాయానికి చక్కని నిదర్శనంగా నిలిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిలకలగూడెానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రకృతి వ్యవసాయ రైతు చింతల వెంకటరెడ్డి తన కుమార్తె వీణ వివాహాన్ని పర్యావరణ ప్రేమికుడు అజిత్‌తో ఘనంగా జరిపించారు. తన 20 ఎకరాల్లో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం స్ఫూర్తితో పెళ్లి వేడుకలోనూ అదే విధానాన్ని అనుసరించారు. స్థానిక రైతులు పండించిన పంటలు, సేంద్రియ పదార్థాలు, సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యత ఇచ్చి పర్యావరణహిత వివాహానికి శ్రీకారం చుట్టారు.
పెళ్లి వేడుకలో ప్లాస్టిక్ కవర్లు, ఫ్లెక్సీలు, కృత్రిమ అలంకరణలకు దూరంగా ఉన్నారు. పెళ్లి పందిరి మొదలుకొని భోజన ఏర్పాట్ల వరకు పర్యావరణానికి హాని కలగని విధంగా ఏర్పాట్లు చేశారు. వేడుకలో వ్యర్థాలు తగ్గించేలా, ప్రకృతిని కలుషితం చేయకుండా నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పెళ్లిళ్లలోనూ పర్యావరణ పరిరక్షణ సాధ్యమేనని ఈ కుటుంబం ఆచరణలో చూపించింది.
పెళ్లి విందులో వంటకాల సంఖ్య కంటే వాటి వెనుక ఉన్న పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్థానికంగా పండించిన పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, గానుగ నూనె, దేశీ ఆవు నెయ్యితో 22 రకాల వంటకాలను సిద్ధం చేశారు. రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పదార్థాలతో వంటలు తయారు చేయడం ఈ విందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతుల కష్టానికి గౌరవం ఇచ్చేలా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అతిథులకు అందించేలా మెనూను రూపొందించారు.
వంటకాల తయారీలో రైతులు కూడా భాగస్వాములయ్యారు. వ్యవసాయ అధికారులు, ప్రకృతి వ్యవసాయ రంగ ప్రతినిధుల పర్యవేక్షణలో సంప్రదాయ పద్ధతుల్లో వంటలు సిద్ధం చేశారు. ఈ వినూత్న వివాహ వేడుకకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్, తెలంగాణ గోశాలల సేవా సమితి అధ్యక్షుడు విజయ్‌రామ్, ప్రధాన కార్యదర్శి యాదగిరితో పాటు పలువురు ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు, స్థానికులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పెళ్లి వేదికగా రైతులకు ప్రోత్సాహం..
ఈ వేడుక ఓ కుటుంబ సంబరానికే పరిమితం కాలేదు. స్థానిక రైతులు పండించిన ఉత్పత్తులకు పెళ్లి విందులో చోటు కల్పించడం ద్వారా వారి పంటలకు గుర్తింపు, ప్రోత్సాహం లభించింది. ప్రకృతి వ్యవసాయం అంటే పొలాల్లో పంటలు పండించడమే కాదు.. మన ఆహారపు అలవాట్లను కూడా ఆరోగ్యకరంగా మార్చుకోవడమనే సందేశాన్ని ఈ వివాహం చాటిచెప్పింది.
చింతల వెంకటరెడ్డి కుటుంబానికి ప్రకృతిపై ఉన్న ప్రేమ పెళ్లి వేడుకతోనే ఆగిపోలేదు. వారి ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని నందనవనంగా తీర్చిదిద్దారు. ఇంటి ఆవరణలో 100కు పైగా రకాల మొక్కలు పెంచుతున్నారు. ఇన్సులిన్ మొక్క, నల్లేరు, రణపాల, కలబంద వంటి ఔషధ మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి. కరోనా కష్టకాలంలో ఈ మొక్కలు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆడంబరాలకు బదులు ప్రకృతికి ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ వివాహం ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ అనేది మాటల్లో కాకుండా మన రోజువారీ జీవనశైలిలోనూ సాధ్యమేనని ఈ కుటుంబం నిరూపించింది. పెళ్లిళ్లు ఎంత ఘనంగా జరిగినా ప్రకృతితో మన బంధం మరింత బలంగా ఉండాలనే సందేశాన్ని ఈ ‘ప్రకృతి పెళ్లి’ అందరికీ అందిస్తోంది.