
హైదరాబాద్, నవంబర్ 29: ఎల్బీనగర్కు చెందిన కొమరవెల్లి సంపత్‌కుమార్‌రెడ్డి కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఇటీవల నగదును సమకూర్చుకున్నారు. ఈ క్రమంలో మన్సూరాబాద్‌లో నివాసముండే తన బావమరిది కుంభం విజయ్‌కుమార్‌రెడ్డికి బ్యాంకు ఖాతా ద్వారా రూ.3.20 కోట్లు పంపించారు. ఈ నెల 22న విజయ్‌కుమార్‌రెడ్డి బ్యాంకు నుంచి మొత్తం నగదును విత్‌డ్రా చేశారు. అయితే అదే సమయంలో కుటుంబంలో బంధువుల వివాహం ఉండటంతో పెద్ద మొత్తంలో నగదును తన ఇంట్లో ఉంచడం కంటే సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచాలని భావించారు. దీంతో మన్సూరాబాద్‌లోని చండీశ్వర్ కాలనీ, రోడ్డు నంబర్-2లో నివాసముంటున్న తన స్నేహితుడు, క్యాబ్ డ్రైవర్ సామ ప్రవీణ్ ఇంట్లో డబ్బును ఉంచారు. బీరువాలో నగదును భద్రపరిచి వెళ్లిపోవడంతో అక్కడే దుండగులు తమ పథకాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది.
శనివారం మధ్యాహ్నం ఈ దోపిడీ చోటుచేసుకుంది. ఇంటి యజమాని ప్రవీణ్ ఏదో పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఆయన తల్లి మణెమ్మ (65), భార్య మౌనిక మాత్రమే ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో మాస్కులు ధరించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. అనుకోకుండా ఇంట్లోకి వచ్చిన వారిని చూసిన మణెమ్మ, మౌనిక ఎవరు? ఎందుకు వచ్చారు? అని ప్రశ్నించేలోపే దుండగులు తమ అసలు రూపాన్ని బయటపెట్టారు. వారిని బెదిరిస్తూ పడకగదిలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరి చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేశారు. వారు కేకలు వేయకుండా, బయటివారికి సమాచారం అందించకుండా జాగ్రత్తపడ్డారు. ఆ తర్వాత నేరుగా బెడ్రూంలోని బీరువా వద్దకు వెళ్లారు. దుండగులు బీరువాను పగులగొట్టి అందులో భద్రపరిచిన రూ.3.20 కోట్ల నగదును తీసుకున్నారు. భారీ మొత్తాన్ని బ్యాగుల్లో సర్దుకుని అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయారు. రెండు ద్విచక్రవాహనాలపై పరారైనట్లు ప్రాథమిక సమాచారం.
దుండగులు వెళ్లిపోయిన కొద్దిసేపటి తర్వాత బాధితులు ఎలాగోలా తమ చేతులకు వేసిన కట్లు తొలగించుకున్నారు. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టపగలు, జనసంచారం ఉండే ప్రాంతంలో ఇంత భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశం, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటిని పరిశీలించి దుండగులు ప్రవేశించిన తీరు, నగదును తీసుకెళ్లిన విధానంపై ఆధారాలు సేకరించారు. అనంతరం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు రెండు బ్యాగులతో అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డైనట్లు గుర్తించారు. దుండగులు ఇంట్లోకి నలుగురుగా ప్రవేశించినట్లు బాధితులు చెప్పగా, సీసీ కెమెరా ఫుటేజీలో ఐదుగురు వ్యక్తులు కనిపించడం దర్యాప్తులో కీలకంగా మారింది. దీంతో దోపిడీలో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య, వారి పాత్రలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో పోలీసులు ప్రధానంగా బాధితుల మధ్య ఉన్న పరిచయాలు, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న సంపత్‌కుమార్‌రెడ్డి గతంలో హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవారు. ఆ సమయంలో సామ ప్రవీణ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నేళ్లుగా వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సంపత్‌కుమార్‌రెడ్డి పంపించిన భారీ నగదు ప్రవీణ్ ఇంట్లో ఉందన్న విషయం ఎవరెవరికి తెలుసు? ఆ సమాచారం దుండగులకు ఎలా చేరింది? నగదు విత్‌డ్రా చేసినప్పటి నుంచి దోపిడీ జరిగే వరకు ఎవరైనా వారిని అనుసరించారా? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో భద్రపరిచిన విషయం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే నిందితుల గుర్తింపు, దోపిడీ వెనుక అసలు కుట్రకు సంబంధించి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. రూ.3.20 కోట్ల భారీ నగదు దోపిడీ కావడంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు.
ఎల్బీనగర్ పోలీసులతో పాటు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, బాధితుల వాంగ్మూలాలు, పాత పరిచయాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నారు. నిందితులు ఉపయోగించిన ద్విచక్రవాహనాలు, వారు పారిపోయిన మార్గాలు, వారికి సహకరించిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. నగదు ఎక్కడికి తరలించారు? దోచుకున్న సొమ్మును ఎక్కడైనా దాచారా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్‌లో పట్టపగలు జరిగిన ఈ భారీ దోపిడీ పోలీసులకు సవాలుగా మారింది. ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉందన్న సమాచారం నిందితులకు ఎలా తెలిసిందన్నదే ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్న. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి, రూ.3.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంటారా? అనేది వేచి చూడాలి.