వాటర్ బిల్లు పెండింగ్ ఉందా? CAN నంబర్ అప్‌డేట్ లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!

హైదరాబాద్ నగరవాసులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. ఈసారి ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు’ (HMWSSB) పేరుతో రంగంలోకి దిగారు. మీటర్ రీడింగ్ అప్‌డేట్ కాలేదని, CAN నంబర్ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉందంటూ నీటి కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు.

వాటర్ బిల్లు పెండింగ్ ఉందా? CAN నంబర్ అప్‌డేట్ లింక్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!
Hmwssb Water Bills, Police Alert

Edited By:

Updated on: Jun 04, 2026 | 7:44 PM

హైదరాబాద్ నగరవాసులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. ఈసారి ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు’ (HMWSSB) పేరుతో రంగంలోకి దిగారు. మీటర్ రీడింగ్ అప్‌డేట్ కాలేదని, CAN నంబర్ ధ్రువీకరణ పెండింగ్‌లో ఉందంటూ నీటి కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు.

సైబర్ కేటుగాళ్లు ముందుగా వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లు లేదా ఫోన్ కాల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తారు. సమస్య పరిష్కారం కావాలంటే కేవలం రూ.10 లేదా రూ.20 మాత్రమే చెల్లించాలని చెబుతారు. చిన్న మొత్తమే కదా అని బాధితులు నమ్మేలా చేసి, ఒక APK ఫైల్ లేదా ‘క్విక్ సపోర్ట్’ లాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోమని లింకులు పంపుతారు. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేయడమే ఆలస్యం.. మొబైల్ స్క్రీన్ హ్యాంగ్ అయిపోతుంది. కొన్నిసార్లు వీడియో కాల్స్ ద్వారా సూచనలు ఇస్తూ బ్యాంకింగ్ యాప్‌లు ఓపెన్ చేయిస్తారు. దీనివల్ల బాధితుడికి తెలియకుండానే బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి. అనంతరం క్షణాల్లో ఖాతాల నుంచి వేల రూపాయల నుంచి లక్షల వరకు కాజేస్తున్నారు.

మాల్వేర్ యాప్‌లతో నిఘా..!

అధికారుల సమాచారం ప్రకారం.. నేరగాళ్లు పంపే యాప్‌లు వాటర్ బోర్డు అధికారిక యాప్‌లు కావు. అవి మొబైల్ స్క్రీన్‌ను గమనించే రిమోట్ యాక్సెస్ సాధనాలు లేదా మాల్వేర్ ఫైళ్లు. వీటి ద్వారా హ్యాకర్లు మన ఫోన్‌లోని ఓటీపీలు, ఎస్‌ఎంఎస్‌లను సులభంగా చదివేసి ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నయా మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు నగర ప్రజలను హెచ్చరిస్తూ పలు జాగ్రత్తలు సూచించారు.

* HMWSSB పేరుతో వచ్చే సందేశాలను వెంటనే నమ్మవద్దు.

* అపరిచితులు పంపే ఎలాంటి APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దు.

* ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్ వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు.

* మీ ఓటీపీ, సీవీవీ (CVV), యూపీఐ పిన్, బ్యాంక్ పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పకండి.

ఒకవేళ మోసపోతే ఏం చేయాలి?

మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఆపేసి, ఆ యాప్‌లను డిలీట్ చేయాలి. తక్షణమే మీ బ్యాంక్ ఖాతాలు, కార్డులను బ్లాక్ చేసి, పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలి. అనంతరం 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us