
సీజనల్ ఫ్రూట్‌గా అందరికీ అందుబాటులో ఉండే సీతాఫలం.. ఈసారి సామాన్యులకు అందనంత దూరం వెళ్తోంది. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం.. మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతలు.. సీతాఫలాల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పూత దశలోనే ఇబ్బందులు మొదలై.. పిందెలు రాలిపోతుండటంతో చెట్లకు కాసిన కాయలు కూడా పూర్తిస్థాయిలో ఎదగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సీతాఫలాల చెట్లు ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రం వీటికి పెట్టింది పేరు. జిల్లాలో గుట్టలు, బంజరు భూములు, అటవీ ప్రాంతాల్లో విస్తారంగా ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక్కడ పండిన పండ్లను హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేవారు. అలాగే మహిళ సంఘాల ఆధ్వర్యంలో సీతాఫలాలను ప్రాసెసింగ్ చేసి కంపెనీలకు విక్రయించి ఆదాయం పొందుతారు. ప్రతీ సీజన్ లో సీతాఫలాల సేకరణతోనూ పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఈసారి వాతావరణ పరిస్థితులతో సీతాఫలం దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. సకాలంలో వర్షాలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగడంతో పూత, పిందె దశలోనే సీతాఫలం చితికిపోతోంది. కొన్ని పిందెలు రాలిపోగా.. మరికొన్ని కాయలు ఎదగకుండా చెట్లపైనే దెబ్బతిన్నాయి.
జూలై నుంచి ఆగస్టు మధ్య పూత పిందెగా మారి, సెప్టెంబర్ మొదటి వారం కల్లా కాయలు పక్యానికి వస్తాయి. కానీ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్సాలు గతి తప్పాయి. రోజుల తరబడి వానలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెట్లకు పిందెలు దక్కలేదు. సాధారణంగా ఒక్కో చెట్టుకు 50 నుంచి 60 కాయలు ఉండాలి. కానీ ప్రస్తుతం పదికి మించి కాయలు కనిపించడం లేదు. సీతాఫలం పంటలో పూత నుంచి కాయ తయారయ్యే దశ కీలకం. ఆ సమయంలో తేమ, వర్షపాతం, ఉష్ణోగ్రతలు మారితే పండ్ల ఏర్పాటుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వాస్తవంగా సహజంగా పెరిగే సీతాఫలం చెట్ల సంఖ్య కూడా తగ్గుతోంది… దీనికి తోడు ఎల్‌నినో తోడైంది. గుట్టలు తొలగించడం, క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, భూముల వినియోగంలో మార్పులతో సహజ సీతాఫలం చెట్ల విస్తీర్ణం తగ్గుతోంది. ఫలితంగా సాధారణ సంవత్సరాలతో పోలిస్తే ఈసారి సరఫరాపై వాతావరణ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
సీతాఫలా దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగింది. దీంతో రేట్లు అమాంతం పెరిగాయి. గతేడాది 15 గ్రాముల నుంచి 180 గ్రాముల వరకు ఉన్న ఒక పండు రూ.5 నుంచి రూ.7 వరకు… ఇంకాస్త పెద్దదైతే రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయించారు. గంపల లెక్కన అయితే రూ.200 నుంచి రూ.250 వరకు అమ్మారు. ఇక తాజాగా గ్రామీణ ప్రాంతాల కంటే హైదరాబాద్ వంటి పట్టణాల్లో సీతాఫలాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒక్కొక్క సీతాఫలాన్ని నాణ్యత, బరువును బట్టి.. ధర 30 నుంచి 50 వరకు అమ్ముతున్నారు. ఇక ఈ సారి ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల కారణంగా సీజనల్ గా ఉపాధి పొందే వారిపైన తీవ్ర ప్రభావం పడింది. సీతాఫలాలను సేకరించే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ సీజన్ లో కష్టకాలం ఎదురవుతోంది. ఆశించిన స్థాయిలో సీతాఫలాల దిగుబడి కనిపించకపోవడంతో ఉపాధి కోల్పోయారు. వీరికి తోడు ఈ పండ్లను సేకరించన తర్వాత ప్రాసెసింగ్ చేసే మహిళ సంఘాలు సైతం ఖాళీగానే కనిపిస్తున్నారు. గతేడాది ఇదే సమాయానికి దాదాపుగా 60శాతం వరకు సీతాఫలాల ప్రాసెసింగ్ నిర్వహించిన వారికి ఈ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క పండు రాలేదు అంటేనే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఒకప్పుడు గుట్టల దగ్గర.. రోడ్ల పక్కన.. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా కనిపించిన సీతాఫలం.. ఇప్పుడు అరుదుగా మారుతోంది. వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడం.. సహజంగా పెరిగే చెట్ల సంఖ్య పడిపోవడం.. రెండూ కలిసి సీతాఫలం ధరలను పెంచుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం తగ్గుతుందా… వచ్చే సీజన్‌లోనైనా సీతాఫలాల వృద్ధికి పరిస్థితులు అనుకూలిస్తాయా చూడాలి.