Telangana: హైదరాబాద్ టు అమరావతి రయ్ రయ్.. జెట్ స్పీడ్‌తో ఆర్ఆర్ఆర్ పనులు.. నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ..

తెలంగాణ రహదారుల రూపురేఖలను మార్చేలా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన కీలక హైవే ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు ఏకంగా 12 లైన్ల హైవేతో పాటు ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతం చేయాలని కోరారు.

Telangana: హైదరాబాద్ టు అమరావతి రయ్ రయ్.. జెట్ స్పీడ్‌తో ఆర్ఆర్ఆర్ పనులు.. నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ..
Cm Revanth Reddy Meets Nitin Gadkari

Edited By:

Updated on: Jul 14, 2026 | 4:08 PM

తెలంగాణలో జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగుతుంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిష్టాత్మక రహదారి ప్రాజెక్టులు, రీజినల్ రింగు రోడ్డు అనుమతులు, కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేల నిర్మాణానికి సంబంధించిన వినతి పత్రాలను కేంద్ర మంత్రికి అందజేశారు. తెలంగాణకు అత్యంత కీలకమైన రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. భూసేకరణ వేగంగా జరిగినందున, పనులను త్వరితగతిన ప్రారంభించడానికి వీలుగా కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇప్పించాలని కోరారు. దీనితో పాటు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కూడా అవసరమైన అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల పనులు ఒకేసారి ప్రారంభమైతే నిర్మాణం వేగంగా పూర్తికావడమే కాకుండా నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుందని సీఎం స్పష్టం చేశారు.

హైదరాబాద్ – అమరావతి మధ్య 12 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే..

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల ప్రకారం.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాల్సి ఉందని సీఎం గుర్తుచేశారు. ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల ర‌హ‌దారిని మంజూరు చేయాలని కోరారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ – విజయవాడల మధ్య ప్రయాణ దూరం దాదాపు 100 కిలోమీటర్లు తగ్గుతుందని వివరించారు. ఈ రహదారి ద్వారా హైదరాబాద్ నుంచి బందరు పోర్ట్‌కు సరుకు రవాణా మరింత వేగవంతమై, ఆర్థికంగా రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని సీఎం తెలిపారు.

రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా 6 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే

హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సీఎం ప్రతిపాదించారు. మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల ప్రత్యామ్నాయ రహదారికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కొత్త రహదారి నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ, వ్యాపార రంగాలకు నూతన అవకాశాలు లభిస్తాయని సీఎం పేర్కొన్నారు.

మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్

నల్లమల అభయారణ్యం, జలాశయాల మీదుగా శ్రీశైలం క్షేత్రం,వెళ్లే మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌‌కు సంబంధించి కేంద్ర అటవీ శాఖ అనుమతులు త్వరగా వచ్చేలా చొరవ చూపాలని నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రగతికి ఊతమిచ్చే ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Follow Us