సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలో కమాన్ ఖమ్మం అంటూ వెంకీమామ సందడి చేశారు. తన వియ్యంకుడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపు కోసం ఖమ్మంలో వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, ఎంపి రేణుకా చౌదరితోపాటు పలువురు కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. వెంకటేష్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. తన సినిమాలో పాటలకు చేతులు ఊపుతూ స్టెప్పులు వేసి వెంకటేష్ ఉత్సాహ పరిచారు. ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి.
అమ్మా.. అక్క.. బాబూ.. తాతా.. చెల్లి.. తమ్ముడూ ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుందా”.. మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్కి ఓటు వేసి గెలిపించండి. అక్కడ భద్రాచలంలో శ్రీ రాముడు.. ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు అంటూ ప్రచారం చేశారు. అలాంటి రఘురాముడికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఓటు వేయడం మన బాధ్యత.. మన హక్కు.. ఎనీ టైం.. ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ రఘురాముడు. అంటూ డైలాగ్ వేశారు. ఖమ్మం.. ఖమ్మం.. ఖమ్మం.. కమాన్ అంటూ ఉత్సాహ పరిచారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సినీ హీరో వెంకటేష్ వియ్యంకులు. వెంకటేష్ కూతురు ఆశ్రితను.. రఘురాం రెడ్డి పెద్ద కుమారుడు.. మంత్రి పొంగులేటి కూతురు స్వప్ని రెడ్డిలను చిన్న కుమారుడు వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వెంకటేష్ కూతురు ఆశ్రిత వారం రోజులుగా ఖమ్మంలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.