తెలంగాణలో త్వరలో రామరాజ్యం రానుందని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ జూటా హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు హిమంత్ బిశ్వ శర్మ. తెలంగాణాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వమే ఎక్కువగా అభివృద్ధికి నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఇంకా తెలంగాణలో రజాకార్ల పాలన కొనసాగుతూనే ఉందని, ప్రధాని మోదీ అభివృద్ధి పరిచిన జాతీయ రహదారులపైనే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పాదయాత్రలు చేపడుతున్నారని అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ ఎద్దేవా చేశారు.
విజయ సంకల్ప బస్సు యాత్రలో భాగంగా మంగళవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ పాల్గొన్నారు. మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోదీనే ప్రధాన మంత్రిగా చేయడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర 5,500 కిలోమీటర్ల మేర సాగనుందన్నారు. దేశం అభివృద్ధి పథంలో సాగాలనే ఉద్దేశంతో యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుందని 2018 సంవత్సరంలో 6.8 శాతం ఓట్లు సంపాదించగా, 2023 లో 14.9 అయిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వీళ్ల పాలన రజాకార్ల పాలనని ,దీన్ని అంతం చేసే రోజులు వస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది రామరాజ్యమనేనన్నారు బిశ్వ శర్మ.
బాబ్రీల కాలం పోయి రామ్ లల్లా సుభిక్ష పాలన సాగుతుందన్నారు అస్సాం సీఎం హిమంత్. దేశ ప్రజలు కాంగ్రెస్ ని తరిమి మోడీకి పట్టం కట్టారని.. రాహుల్ భారత్ జోడో అంటూ పాదయాత్ర చేస్తే మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ చేతులో నుండి వెళ్లిపోయాయని.. న్యాయ యాత్ర అంటూ మరోసారి యాత్ర చేస్తున్న రాహుల్ ఎఫెక్ట్ తో దేశంలో కాంగ్రెస్ కనుమరుగవడం ఖాయమన్నారు. మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, కరోనా కష్టాలను దాటించి ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. దేశ జీడీపీ పెంచి ప్రపంచం దేశం వైపు చూసేలా, విశ్వ గురువుగా భారత్ ను తీర్చిదిద్దారని హిమంత్ బిశ్వ శర్మ కితాబిచ్చారు. ప్రజలు ముచ్చటగా మోదీని మూడోసారి ప్రధానిగా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణాలోను భారీ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు హిమంత్.
తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోతుందని, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదని అన్నారు. ప్రదాని మోదీ మాత్రం పక్కాగా హామీలను నెరవేర్చి వ్యక్తి అని కొనియాడారు. అస్సాం రాష్ట్రంలో పెట్రోల్ 98 రూపాలు కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై టాక్స్ వేసి 110 రూపాలకు ఇస్తూ ప్రజలపై భారాన్ని వేస్తున్నారని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ప్రపంచ దేశాలే తన వైపు తిరిగి చూస్తున్నాయని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ అందించాలని, అదిలాబాద్ పార్లమెంట్ సీటుని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ఈ బహిరంగ సభలో మణిపూర్ మంత్రి సుసింద్రీ, జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….