Hyderabad: పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికులు.. ఐదుగురు మృతి!

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో సోమవారం (ఏప్రిల్ 28) సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి ప్రకోపానికి తోడు పారిశ్రామిక భద్రతా లోపాలు తోడవడంతో ఐదుగురు అమాయక కార్మికులు బలికాగా, మరో 11 మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Hyderabad:  పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికులు.. ఐదుగురు మృతి!
Crane Collapses

Updated on: Apr 28, 2026 | 7:13 AM

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో సోమవారం (ఏప్రిల్ 28) సాయంత్రం సంభవించిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతి ప్రకోపానికి తోడు పారిశ్రామిక భద్రతా లోపాలు తోడవడంతో ఐదుగురు అమాయక కార్మికులు బలికాగా, మరో 11 మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

శంకరపల్లి మండలం మహాలింగాపురం పరిధిలోని ఎన్ సీసీ (NCC) సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సోమవారం సాయంత్రం కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో కంపెనీ ప్రాంగణంలోని ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి, కింద పని చేస్తున్న కార్మికులపై కుప్పకూలింది. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం 16 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్రేన్ కింద నలిగి ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే శంకరపల్లిలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు . గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా కంపెనీలో ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? అంత భారీ క్రేన్ గాలికి పడిపోయేంత బలహీనంగా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ విషాద ఘటనతో మహాలింగాపురం గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పొట్టకూటి కోసం వచ్చి విగతజీవులుగా మారిన కార్మికుల కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. ప్రభుత్వం మరియు యాజమాన్యం బాధితులను ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us