పుంగనూరు ఆవు అంటే ఇష్టపడని వారుండరు. పుంగనూరు అరుదైన జాతి ఆవులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ జాతి ఆవులు కూడా అంతరించిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక పల్లె గ్రామానికి చెందిన ఒక యాజమానురాలు తన ఇంట్లో లక్ష్మి దేవి జన్మించిందని, తనకు ఇంట్లో ఒక ఆడపిల్ల లాగా.. అల్లారుముద్దుగా పుంగనూరు జాతి ఆవును పెంచుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం జయలక్ష్మిపురం గ్రామంలో అరుదైన జాతికి చెందిన పుంగనూరు ఆవును పెంపుడు జంతువుగా సాకుతున్నారు. గుంట్రు వెంకట స్వామి, తిరుపతమ్మలకు ఒక కుమారుడు. వీరికి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. తమకు కూతురు లేకపోయినా.. ఒక ఆవును తెచ్చుకుని పెంచుతున్నారు. అదే ఆవుకు పక్క గ్రామంలోని వెటర్నరీ వైద్యుడు సహాయంతో ఇంజక్షన్ ద్వారా క్రాసింగ్ చేయడంతో పుంగనూరు జాతి ఆవు జన్మించింది. దీంతో ఆ ఇంటి యజమానురాలు తిరుపతమ్మకు పట్టలేని సంతోషం కలిగింది. తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని, తమకు ఆడ పిల్ల లేక పోయినా.. తమకు కూతురులా పుంగనూరు జాతి ఆవు జన్మించడం అదృష్టంగా భావింస్తున్నారు.
ఆవు మెడకు, కాళ్లకు, నడుముకి మువ్వలు కట్టి అందంగా అలంకరించి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. అయితే అత్యంత అరుదైన పుంగనూరు జాతి ఆవు కావడం, చూడటానికి ఎంతో ముద్దుగా 02 అడుగులు ఎత్తు మాత్రమే ఉండి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలిసి తిరుగుతుంది. ఈ అరుదైన జాతి ఆవును చూసేందుకు చాలా మంది వస్తున్నారు. ఇంటి యజమానులు మాత్రం తమకు బిడ్డ కంటే ఎక్కువ ప్రేమగా సాకుతున్నామని, చాలా మంది చూడటానికి వచ్చి డబ్బులు ఇస్తాము అమ్ముతారా అని అడుగుతున్నట్లు చెబుతున్నారు. ఎంత మంది వచ్చి అడిగినా లక్ష్మీదేవిగా భావించే మా ఆవును అమ్మ లేమని వారు చెప్తున్నారు. ఏది ఏమైనా అరుదైన జాతి ఆవును చూసేందుకు జనాలు పదుల సంఖ్యలో తరలి రావడం విశేషం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..