నాగోల్, నవంబర్ 7: గుడినే కాదూ.. గుడిలో లింగాన్ని మాయం చేస్తోన్న జమానా ఇది. ఇక బడి ఓ లెక్కా. అవును.. హైదరాబాద్ నాగోల్‌లోని ఓ స్కూల్ జాగాపై కన్నేసిన కబ్జాకోరు.. గజాల చొప్పున లెక్కగట్టి ఆక్రమణకు స్క్రీన్ ప్లే రచించాడు. అనుకున్నట్టే ప్రహారీ గోడను కూల్చేశాడు. అంతలోనే బడి పిల్లలంతా ఎదురు తిరిగారు. మా స్కూల్ మాగ్గావాలి అంటూ కదం తొక్కారు. క్లాస్‌లోకి ఎలుకలు వస్తున్నాయ్.. కళ్లల్లో దుమ్ము పడుతుంది.. ఇబ్బంది అవుతుంది సార్ అంటూ టీవీ9కు కష్టాలను ఏకరువు పెట్టారీ బంగారు తల్లులు. ఇంతకీ ఎవరా చిట్టి సోల్జర్స్? ఏంటా కబ్జా కహానీ?
నాగోల్ బండ్లగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 74ఏళ్ల చరిత్ర ఉంది. మరో ఏడాదైతే వజ్రోత్సవ సంబరాలు జరుపుకోవాల్సిన సమయం. కానీ ఏం లాభం? ఓ ప్రైవేట్ వ్యక్తి ఈ సర్కార్ స్కూల్‌పై కన్నేశాడు. దసరా సెలవుల్లో పోలీస్ ప్రొటెక్షన్‌తో వచ్చి కాంపౌండ్ వాల్‌ని కూల్చేశాడు. కూలిన గోడల్ని చూసి విద్యార్థులంతా భోరుమన్నారు. మా స్కూల్ మాక్కావాలంటూ రోడ్డెక్కారు. ప్లేట్లను చేతుల్లోకి తీసుకుని నినదించారు. కళ్లకు గంతలు కట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఏళ్ల తరబడి ఈ స్కూల్‌కి సొంత భవనం లేదు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గ వసతులు లేవు. రేకులతో కూడిన రెండు షెడ్లు.. ఓ వరండాలోనే క్లాస్‌లు జరుగుతున్నాయి. స్కూల్ దీనస్థితిని గమనించిన అధికారులు.. 1998లో బండ్లగూడ సర్వే నంబర్ 36/6లోని ప్రభుత్వ స్థలంలో 1.09 ఎకరాలను కేటాయించారు. తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల భవన నిర్మాణ పనుుల ప్రారంభించారు. గోడలు నిర్మిస్తుండగానే 2000లో కొందరు వ్యక్తులు అది తమ ఆస్తిగా పేర్కొంటూ కోర్టుకెళ్లారు.
2012లో అప్పటి తహశీల్దార్ సర్వే చేపట్టి.. ప్రభుత్వ భూమిగా నివేదిక సమర్పించడంతో కోర్టు ప్రభుత్వ భూమిగా తేల్చింది. ఆ తర్వాత సర్వశిక్ష అభయాన్ ఆధ్వర్యంలో స్థలం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. తరగతి గదుల నిర్మాణానికి పునాదుల దిమ్మెలు వేశారు. అంతలోనే మరోసారి ప్రైవేటు వ్యక్తులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటినుంచి ఎన్నో ఇబ్బందుల మధ్య విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన 1.09ఎకరాల భూమి విలువ ప్రస్తుతం రూ.20కోట్ల వరకు ఉంటుంది. మూడు వైపుల ప్రభుత్వ స్థలం.. ఓ వైపు రోడ్డు ఉంటే అది ప్రైవేట్ వ్యక్తులది ఎలా అవుతుందని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదే స్కూల్‌లో మేం చదువుకున్నాం.. మా పిల్లల్ని చదివిస్తున్నాం. అయినా కబ్జా పీడ మాత్రం వదలడం లేదంటున్నారు. స్కూల్‌కి సంబంధించిన హద్దులు, రికార్డులు పక్కాగా ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యమే కబ్జాకోరులకి వరంగా మారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా స్కూల్ నిర్మాణం పూర్తి చేయాలంటున్నారు స్థానిక నేతలు. స్కూల్‌ని కాపాడే బాధ్యత తీసుకుంటామన్నారు లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పక్కా రికార్డులు కోర్టులో సమర్పించి.. ప్రైవేట్ వ్యక్తుల ఆర్డర్ రద్దయ్యేలా చూస్తామన్నారు.
ఉప్పల్, నాగోల్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదో శుభపరిణామం అనే చెప్పాలి. ఇలాంటి అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకుని పిల్లలకు విద్యనందించాలి. కానీ పాఠాలు చెప్పే పరిస్థితి లేకుండా చేస్తే ఎలా? కబ్జాకోరులు దర్జాగా బడి స్థలాన్ని మింగేస్తుంటే చూస్తూ ఉండిపోవాల్సిందేనా? ఈ మధ్య ఎంట్రీ ఇచ్చిన హైడ్రా.. స్కూల్ ఆక్రమణపై దృష్టి సారించాలంటున్నారు స్థానికులు. ఎక్కడెక్కడో నిర్మాణాలను కూల్చేస్తున్నారు. కానీ ఇక్కడి కబ్జారాయుళ్లపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జోక్యం చేసుకుని స్కూల్ నిర్మాణం వేగవంతం చేయాలంటున్నారు నాగోల్‌వాసులు. అక్రమార్కుల కన్ను మరోసారి స్కూల్‌పై పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలంటున్నారు.