గ్రామ పంచాయితీలకు కేసీఆర్ వరాలు.. ఏటా రూ.8 లక్షల నిధులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ వరాలు జల్లులు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, రైతు బంధు పథకం నిధులు పెంపు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక గ్రామ పంచాయితీలకు కేసీఆర్ తీపి కబురు చెప్పారు.  ప్రతి ఏటా ఒక పంచాయతీకి ఏటా రూ.8 లక్షల అభివ‌ృద్ధి నిధులు అందజేస్తామని  ప్రకటించారు.  నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జాతీయ జెండా ఎగరేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం స్థానిక సంస్థల పనితీరును పునర్నిర్వచిస్తూ నూతన పంచాయతీ రాజ్ చట్టానికి రూపకల్పన చేశామని, ఈ చట్టం పంచాయతీ రాజ్ సంస్థలకు నిర్ధిష్టమైన విధులను, బాధ్యతలను నిర్దేశిస్తూ, కావాల్సిన నిధులను క్రమం తప్పకుండా ప్రభుత్వం సమకూరుస్తుందని అన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 1,229 కోట్ల రూపాయలను కేటాయించిందని… కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రూ.1,229 కోట్లు కేటాయిస్తుందని చెప్పారు. మొత్తం మీద గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు ఏటా మొత్తం 2,458 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందుతాయి అని  సీఎం తెలిపారు.

500 జనాభా కలిగిన చిన్న గ్రామ పంచాయతీకి కూడా ఏడాదికి 8 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు అందుతాయని, వీటికి తోడు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా స్థానిక సంస్థలకు అందుబాటులో ఉంటాయన్నారు. భవిష్యత్తులో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత అనే సమస్య ఉండదని హామీ ఇచ్చారు. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండబోదని, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ విధి నిర్వహణలో విఫలమైతే వారిని పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *